
-
రూ. 14 కోట్ల విలువ చేసే డ్రగ్ స్వాధీనం
గువాహటి: గువాహటిలో కరుడుగట్టిన డ్రగ్ మాఫియా లీడర్, హంతకుడు సంసుల్ హక్ తాలుక్దార్ అలియాస్ పాఖి మియా కుమారుడు అతౌర్ రెహమాన్‌ను ఎన్‌సీబీ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితుడి నుంచి భారీగా నిషిద్ధ మార్ఫిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం రాత్రి సోనాపూర్ ప్రాంతంలో రెండు వాహనాల నుంచి రూ.14 కోట్ల విలువైన మార్ఫిన్‌ను ఎన్‌సీబీ, గౌహతి సిటీ పోలీసుల సంయుక్త బృందం స్వాధీనం చేసుకుంది.
అతౌర్ రెహమాన్ తండ్రి పాఖీ మియా అసొం, నార్త్ ఈస్ట్‌లో అతిపెద్ద డ్రగ్ మాఫియాను నడిపాడు. ఇంకా.. సెప్టెంబరు 12, 2006న గువాహటిలో రెవెన్యూ ఇంటెలిజెన్స్ అధికారి తపన్ కుమార్ దత్తా హత్యలో పాల్గొన్నాడు.
హత్య, కిడ్నాప్, దోపిడీ, మాదక ద్రవ్యాల వ్యాపారం, మహిళల అక్రమ రవాణా, జైల్‌బ్రేక్‌తో పాటు 20కి పైగా కేసులు పాఖీ మియాపై నమోదయ్యాయి. కొన్నాళ్ళ పాటు జైలు శిక్ష అనుభవించిన అతడు ఇప్పుడు బెయిల్‌పై బయట ఉన్నాడు.
కాగా, అతౌర్‌తో సహా పట్టుబడిన ముగ్గురిని గువాహటికి తీసుకొచ్చారు. గువాహటిలో తాజా డ్రగ్స్‌లో పాఖీ మియాకు ఉన్న లింక్‌ను తెలుసుకోవడానికి సిటీ పోలీసులు కేసును మరింత దర్యాప్తు చేస్తున్నారు.
Source: Organiser





