News

ఘనంగా ముగిసిన మేడారం మహా జాతర

636views

భాగ్య‌న‌గ‌రం: సమ్మక్క, సారలమ్మలు వనప్రవేశం చేయడంతో తెలంగాణలో మేడారం మహాజాతర ముగిసింది. ఆఖరి రోజు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. సాయంత్రం వరకు దర్శనాలు నిర్విరామంగా కొనసాగాయి. ఆరు గంటల తర్వాత పూజారులు గద్దెల వద్ద పూజలు నిర్వహించారు.

డప్పు, డోలు వాయిద్యాలతో వన ప్రవేశ ఘట్టం కోలాహలంగా సాగింది. విద్యుద్దీపాలు నిలిపేసిన అనంతరం.. వన దేవతలను గద్దెల నుంచి తరలించారు. అమ్మవార్లు వనానికి తరలుతున్న సమయంలో మేడారం పరిసరాలు భక్తుల జయజయధ్వానాలతో మారుమోగాయి.

సమ్మక్కను చిలుకలగుట్టకు, సారలమ్మను కన్నెపల్లికి పూజారులు తీసుకెళ్ళారు. పగిడిద్ద రాజును మహబూబాబాద్​ జిల్లా గంగారం మండలం పూనుగొండ్లకు, గోవిందరాజును ఏటూరు నాగారం మండలం కొండాయికి తీసుకెళ్లడంతో వన ప్రవేశ ఘట్టం ముగిసింది. క్యూలైన్లలో బారులు తీరిన భక్తజనం.. వన ప్రవేశ ఘట్టాన్ని తిలకించి పరవశులయ్యారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి