News

ప్రముఖ సాహితీవేత్త ఆశావాది ప్రకాశరావు ఇక లేరు

501views

అనంతపురం: ప్రముఖ సాహితీవేత్త, పండితుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్‌ ఆశావాది ప్రకాశరావు ఇక లేరు. ఈ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు పెనుకొండలో తుదిశ్వాస విడిచారు. ప్రకాశరావు ఆంధ్రప్రదేశ్‌కు సమరసత వేదికకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. దళితులలో మొదటి అవధానిగా పేరుగాంచిన ఆశావాది అనంతపురం జిల్లా వాస్తవ్యులు. 2021లో కేంద్రం ప్రకాశరావు ప్రతిభను గుర్తించి పద్మశ్రీని అందజేసింది.

పెరవలి గ్రామంలో 1944లో ఆగస్టు రెండోతేదీ జన్మించిన ఆశావాది… ఉపాధ్యాయుడిగా సుదీర్ఘకాలం పనిచేసి ప్రధాన ఆచార్యులుగా పదవీ విరమణ చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్‌ ప్రదానం చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ‘కళారత్న’తో గౌరవించింది. ప్రఖ్యాత అవధాన కవులు కొప్పరపు కవుల పేరున వెలసిన శ్రీ కొప్పరపు కవుల కళాపీఠం అవధాన పురస్కారం సమర్పించింది.

19వయేట మొదటి అవధానం

అవధాన విద్యలో డాక్టర్‌.సి.వి.సుబ్బన్న శతావధానిని గురువుగా స్వీకరించి అతని ఆశీస్సులతో ఆశుకవిత అలవరచుకున్నారు. 1963లో తన 19వయేట మొదటి అవధానం చేశారు. అప్పటి నుండి ఆంధ్రసాహితీ చరిత్రలో దళితులలో ఏకైక అవధానిగా ముద్రవేసికొని అసాధారణ ధారణాశక్తితో, అనిర్వచనీయమైన మహేంద్రజాలశక్తితో శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు.

ఆంధ్రదేశంలోనే కాకుండా ఆంధ్రేతర ప్రాంతాలైన తరుత్తణి, అరక్కోణం, పళ్ళిపట్టు, హోసూరు, బెంగళూరు, బళ్లారి, తుంగభద్రడ్యామ్‌, దోణిమలై, ఢిల్లీ మొదలైన పలుప్రాంతాలలో 171 అష్టావధానాలు, ఒక ద్విగుణిత అష్టావధానం చేశారు. ఇతని అవధానాలు దూరదర్శన్‌, ఆకాశవాణిలలో కూడా ప్రసారం అయ్యాయి. కొన్ని ఆశుకవితా ప్రదర్శనలు కూడా ఇచ్చారు.

ప్రకాశరావు తాను అవధానాలు చేయడమేకాక, ఎందరో అవధానులను కూడా తయారు చేసిన సేవాతత్పరుడు. ఆశావాది ప్రకాశరావు ఆకాల మృతికి సాహితీవేత్తలు, సాహితీ ప్రియులు, సామాజిక సమరసత వేదిక తమ ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి