News

హిమపాతంలో గల్లంతైన ఏడుగురు సైనికులు మృతి

555views
  • ఆర్మీ ధ్రువీక‌ర‌ణ‌

న్యూఢిల్లీ: ఆర్మీలో విషాదం చోటుచేసుకుంది. దేశానికి నిత్యం ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్న సైనికులు మృతి చెందారు. అరుణాచ‌ల్‌ ప్రదేశ్‌లోని కమెంగ్ సెక్టార్‌లోని ఎత్తైన ప్రాంతంలో హిమపాతంలో చిక్కుకొని ఏడుగురు జవాన్లు గ‌ల్లంతై మృతి చెందారు. ఈ మేర‌కు భారత సైన్యం మంగళవారం ధ్రువీకరించింది. కమెంగ్ సెక్టార్ నుంచి వీరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు భారత ఆర్మీ ప్రకటనలో వెల్లడించింది.

ఎత్తైన ప్రాంతమైన కమెంగ్‌ సెక్టార్‌లో ఆదివారం సైనికులు పెట్రోలింగ్‌ నిర్వర్తిస్తున్న సమయంలో భారీగా హిమపాతం సంభవించిందని దీంతో సైనికులు అక్కడే చిక్కుకుపోయారని తెలిపింది.

మరణించిన ఏడుగురు సిబ్బంది 19 జమ్మూకశ్మీర్ రైఫిల్స్‌ పదాతిదళ రెజిమెంట్‌కు చెందిన వారు. వారు యాంగ్జీ సమీపంలోని చుమే గ్యటర్ ప్రాంతంలో పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు హిమపాతం సంభవించింది. మరణించిన వీరసైనికులు జుగల్ కిషోర్, అరుణ్ కట్టాల్, అక్షయ్ పఠానియా, విశాల్ శర్మ, రాకేష్ సింగ్, అంకేష్ భరద్వాజ్, గుర్బాజ్ సింగ్ ఉన్నారు.

వారి అత్యున్నత త్యాగానికి నివాళులు అర్పిస్తున్నట్టు ఈస్టర్న్ కమాండ్, ఇండియన్ ఆర్మీ ప్రకటించాయి. బాధిత కుటుంబాల‌కు ఒక్కొక్కరికి రూ. 4 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ ప్రకటించారు.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి