News

దేశ భద్రతకు భంగం కలిగిస్తే పాత్రికేయుల గుర్తింపు రద్దు

643views
  • కేంద్రం కొత్త మార్గదర్శకాలు

న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మీడియా అక్రెడిటేషన్ గైడ్‌లైన్స్-2022 విడుద‌ల చేసింది. భారత దేశ సార్వభౌమాధికారం, సమగ్రతలకు నష్టం కలిగించే విధంగా ప్రవర్తించినా, దేశ భద్రతకు భంగం కలిగించే విధంగా వ్యవహరించినా, విదేశాలతో స్నేహ సంబంధాలు, ప్రజా భద్రత, నైతికత, డీసెన్సీలకు విరుద్ధంగా ప్రవర్తించినా, కోర్టు ధిక్కారం, పరువు నష్టం లేదా నేరాన్ని ప్రోత్సహించడం వంటివాటికి పాల్పడినా పాత్రికేయుల అక్రెడిటేషన్‌ను రద్దు చేయవచ్చునని ఇందులో ఉన్న ఓ నిబంధన చెప్తోంది. ఈ మార్గదర్శకాలను ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో విడుదల చేసింది.

వెబ్ జర్నలిస్టులకు కూడా ప్రభుత్వ అక్రెడిటేషన్లు ఇవ్వాలని ఈ మార్గదర్శకాలు చెప్తున్నాయి. వీరికి ఈ సదుపాయం కల్పించాలని నిర్ణయించడం ఇదే మొట్టమొదటిసారి. ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ, లోపాలను సరిదిద్ది ఈ మార్గదర్శకాలను రూపొందించినట్టు తెలిపారు. ఈ కొత్త నిబంధ‌నలు సంస్కరణలతో కూడుకున్నవని చెప్పారు. డిజిటల్ మీడియాకు పూర్తి స్థాయి గుర్తింపునిచ్చినట్టు తెలిపారు. చరిత్రలో తొలిసారి విదేశీ మీడియా కూడా అక్రెడిటేషన్ పొందుతుందన్నారు.

చైనా కోసం నిఘా కార్యకలాపాలు నిర్వహిస్తున్న పాత్రికేయుడు గతంలో పట్టుబడ్డారని, అయితే ఆయన అక్రెడిటేషన్‌ను రద్దు చేయడం సాధ్యం కాలేదని అన్నారు. దీనికి సంబంధించిన నిబంధన అప్పట్లో లేదన్నారు.

Source: andhra jyothi

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి