News

చైనా-పాకిస్తాన్‌ల‌ దుర్బుద్ధి.. క‌శ్మీర్‌పై ఉమ్మ‌డి ప్ర‌క‌ట‌న‌!

474views
  • తీవ్రంగా ఖండించిన భారత్

న్యూఢిల్లీ: గతంలో పాక్‌- చైనా సంయుక్త ప్రకటనలో జమ్ము కశ్మీర్ గురించి చేసిన సూచనలను భారతదేశం గట్టిగానే తిరస్కరించింది. జమ్ము కశ్మీర్‌ కేంద్రపాలిత ప్రాంతం, లడఖ్ అందులో అంతర్భాగమని, విడదీయరాని భాగమని నొక్కి చెప్పింది భారత ప్రభుత్వం. అయినా ఈ రెండు దేశాల బుద్ధి మాత్రం మారడం లేదు. పాత పాటే వినిపిస్తున్నాయి.

తాజాగా ఈ రెండు దేశాలు మరోసారి కశ్మీర్‌ తేనెతుట్టేను కదిలించాయి. వింటర్‌ ఒలింపిక్స్‌ వంకతో చైనా పర్యటనకు వెళ్లిన పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌.. వాణిజ్యపరమైన ఒప్పందాలు, చర్చల కోసం మరో నాలుగు రోజులు అక్కడే మకాం వేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సరిహద్దు వివాదం.. అందునా కశ్మీర్‌పై ఇతరుల ఏకపక్ష చర్యల్ని సహించబోమంటూ ప్రకటనలు చేయడం విశేషం.

ఒకవైపు తమ పౌరులపై పాక్‌లో వేర్పాటు వాద సంస్థలు దాడులు చేస్తుండడం, మరోవైపు ఉయిగర్లపై చైనా ఆర్మీ కొనసాగిస్తున్న హింసాకాండపై.. ఈ సమావేశాల్లో రెండు దేశాలు మౌనం వహించాయి. అంతర్జాతీయ సమాజం నుంచి గత కొంతకాలంగా ఒత్తిళ్లు వస్తున్నప్పటికీ ఈరెండు దేశాలు ఎలాంటి ప్రస్తావన తీసుకురాకపోవడం గమనార్హం.

ఇక చైనా-పాకిస్తాన్‌ ఎకనమిక్ కారిడార్(సీపీఈసీ) ప్రధాన అంశంగా సాగిన పాక్‌ ప్రధాని పర్యటనలో.. కారిడార్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు పాకిస్థాన్‌తో కలిసి పనిచేస్తామని చైనా హామీ ఇచ్చింది. కశ్మీర్ అంశాన్ని శాంతియుతంగా, చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి చైనా మద్దతునిస్తున్నట్టు అక్కడి అధికార యంత్రాంగం పేర్కొంది. ఏకపక్ష చర్యలు పరిస్థితిని తీవ్రతరం చేస్తాయని, వీటిని తాము వ్యతిరేకిస్తున్నట్టు పరోక్షంగా భారత్‌పై అక్కసు వెల్లగక్కాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి