News

శ్రీ‌వారి ద‌ర్శ‌నం కోసం గోవింద నామ స్మరణతో భక్తుల నిరసన

522views

తిరుప‌తి: కరోనా ప్రభావం, తిరుమ‌ల పాల‌న విభాగం వైఖరి వెర‌సి శ్రీ‌వారి భ‌క్తులు తీవ్ర ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. కరోనా మొదలైనప్పటి నుంచి భక్తులకు ఆఫ్‌లైన్‌ దర్శనం టికెట్లు దూరం కావడంతో గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి సమస్యలు త‌ప్ప‌డం లేదు.

ఆన్‌లైన్‌లో మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, సర్వ దర్శనం టోకెన్లు అందుబాటులో ఉన్నప్పటికీ అవి పరిమిత సంఖ్యలోనే కావడంతో టీటీడీ వెబ్‌సైట్‌లో విడుద‌ల‌ చేసిన కొన్ని నిమిషాల్లోనే అయిపోతున్నాయి.

దీంతో పల్లె ప్రాంతాల భక్తులకు పెద్దగా ఆ టికెట్లు దక్కడం లేదు. పైగా వీటి గురించి అవగాహన లేని కొందరు భక్తులు తిరుపతి వరకూ వచ్చి.. తిరుమల శ్రీవారి కొండపైకి చేరుకోలేక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఇవాళ తిరుపతిలో చోటు చేసుకుంది.

దర్శనం టికెట్లు లేవని, తిరుమలకు అనుమతించకపోవడంతో తిరుపతిలోని గరుడ సర్కిల్‌ ఆవరణలో తమిళనాడు భక్తులు ఆందోళనకు దిగారు. తమిళనాడు నుంచి కాలినడక వందలాదిగా అలిపిరికి భక్తులు చేరుకున్నారు. అయితే, వారిలో దర్శన టికెట్ ఉన్న వారిని మాత్రమే టిటిడి సిబ్బంది తిరుమల అనుమతించారు.

దర్శనం టోకెన్ లేని భక్తులను అనుమతించలేదు. దీంతో గరుడ సర్కిల్ ఆవరణలో రోడ్డుపై బైఠాయించి తమనూ కొండపైకి అనుమతించాలని కోరుతూ నిరసనకు దిగారు. గోవింద నామస్మరణ చేస్తూ తమ నిరసనను తెలిపారు. అయితే ఎంతకూ కనికరించడంతో వారు వెనుదిరిగినట్టు తెలుస్తోంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి