News

తిరుమలలో విపత్తు నిర్వహణ పై కమిటీ ఏర్పాటు.. అధికారులతో అదనపు ఈవో సమావేశం

568views

తిరుమలలో విపత్తుల‌ నిర్వహణ ప్రణాళికపై శుక్రవారం తిరుమల అన్నమయ్య భవన్ ‌లో అన్ని విభాగాల అధికారుల‌తో టిటిడి అదనపు ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి సమావేశం నిర్వహించారు.

ఈ సంద‌ర్భంగా శ్రీ ధర్మారెడ్డి మాట్లాడుతూ అధికారులు ఏడు రోజుల్లోపు ఆయా విభాగాలకు సంబంధించిన విపత్తుల నిర్వహణ ప్ర‌ణాళికను సిద్ధం చేయాల‌ని ఆదేశించారు. భారీ వ‌ర్షాలు, పిడుగులు, అగ్నిప్ర‌మాదాలు, వేస‌విలో వ‌డ‌గాలులు లాంటి స‌వాళ్లు ఎదుర‌వుతాయ‌ని, వీటిని ఎదుర్కొనేందుకు ప్ర‌ణాళికాబ‌ద్ధంగా కృషి చేయాల‌ని కోరారు. ర‌ద్దీ అధికంగా ఉన్న స‌మ‌యాల్లో భ‌క్తులను క్ర‌మ‌బ‌ద్దీక‌రించేందుకు మ‌న‌కు ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తా వ్య‌వ‌స్థ ఉంద‌న్నారు. ప్ర‌కృతి విప‌త్తులు సంభ‌వించిన‌పుడు భారీ న‌ష్టం జ‌ర‌గ‌కుండా చూడాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

ఇందుకోసం ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో ట్రాన్స్ ‌పోర్ట్ జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ శ్రీ శేషారెడ్డి, డిఇ ఎలక్ట్రికల్స్‌ శ్రీ రవిశంకర్ రెడ్డి, విజివో శ్రీ బాలిరెడ్డి, ఎస్టేట్ ఆఫీసర్ శ్రీ మల్లికార్జున, శ్వేత‌ డైరెక్టర్, ఇన్‌చార్జి డిఎఫ్ ‌వో శ్రీమతి ప్రశాంతి సభ్యులుగా ఒక కమిటీని అద‌న‌పు ఈవో ఏర్పాటు చేశారు. తిరుమలలో సంభవించే విపత్తుల‌కు సంబంధించి ఆయా శాఖలకు సంబంధించి స్టాండ‌ర్డ్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్స్‌(ఎస్‌ఓపీ)ను సిద్ధం చేసి నాలుగు రోజుల్లో కమిటీకి సమర్పించాలని ఆయన విభాగాధిప‌తుల‌ను ఆదేశించారు. దీనిపై ఈ కమిటీ వారంలోగా సమగ్ర నివేదికను సమర్పించాల‌న్నారు.

ఈ స‌మావేశంలో ఇఇలు శ్రీ జగన్మోహన్ రెడ్డి, శ్రీ సురేంద్రనాథ్ రెడ్డి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, డెప్యూటీ ఈవోలు శ్రీ రమేష్ బాబు, శ్రీ హరీంద్రనాథ్, శ్రీ లోకనాథం, శ్రీ భాస్కర్, తిరుపతి విజివో శ్రీ మనోహర్, అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.