NewsProgramms

నడి సంద్రంలోనూ నమస్తే సదావత్సలే….

853views

* మరోసారి వెలుగులోకొచ్చిన ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవకుల క్రమశిక్షణ, నిబద్ధత

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) అంటే తెలియని వారు బహుశా దేశంలో ఎవరూ ఉండరు. దేశభక్తికి, క్రమశిక్షణకు, నిబద్ధతకు పెట్టింది పేరు ఆర్ ఎస్ ఎస్ స్వయంసేవకులు. దేశంలో ఎలాంటి ఉత్పాతం సంభవించినా మేమున్నామంటూ ముందుకురికి ప్రభుత్వ సహాయక చర్యలతో సమాంతరంగా… ఒక్కొక్కసారి వారికంటే మిన్నగా బాధితులకు తమ సేవలను అందిస్తూ ఉంటారు స్వయంసేవకులు. ఈ క్రమంలో వారు ఎండని, వర్షాన్ని, చలిని, మంచును, రాళ్లను, రప్పలను, కొండలను, గుట్టలను, కోనలను, క్రూర జంతువులను సైతం లెక్కచేయక ముందడుగు వేసి ఆపదలో ఉన్న ఎందరికో ఆపన్న హస్తం అందించిన సంఘటనలు కోకొల్లలు. అందుకు వారికి ప్రతిరోజూ తమ తమ గ్రామాలలో, బస్తీలలో జరిగే శాఖలలో వారు పొందే శారీరిక, మానసిక శిక్షణ ఎంతగానో ఉపకరిస్తుంది.

అందుకే స్వయంసేవకులు ఎవరైనా ప్రతిరోజూ తమకు సమీపంలో జరిగే శాఖకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తారు. కరోనా కల్లోల సమయంలో సైతం ఆన్లైన్ శాఖలు దేశవ్యాప్తంగా నిరాటంకంగా కొనసాగాయి. ఎంతటి క్లిష్ట పరిస్థితుల్లో అయినా, ఎండ, వాన, చలి వంటి ఎలాంటి వాతావరణంలోనైనా, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా ఎన్ని పనులున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా, చివరికి అనారోగ్యం ఉన్నా సరే వారు శాఖకు వెళ్లడం మాత్రం మానుకోరు. ఆ పట్టుదల, నిబద్ధతలే స్వయంసేవకులను ప్రత్యేకంగా, విజయశీలురుగా, వివేకవంతులుగా నిలుపుతున్నాయి.

తాజాగా ఆంధ్ర – ఒరిస్సా సరిహద్దు గ్రామమైన కొత్తపాలెంలో జరిగిన ఓ సంఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన కొందరు మత్స్యకారులు ఆర్ ఎస్ ఎస్ లో క్రియాశీల సభ్యులుగా ఉన్నారు. వారు ఈరోజు 24/1/2022, సోమవారం ఉదయం 3 గంటలకు రెండు పడవలలో తమ సహచర మత్స్యకారులతో కలిసి సముద్రంలో వేటకు వెళ్లారు. సముద్రంలో అలా అలా సమయం గడిచిపోయింది. తెల్లారి పోయింది. తాము గ్రామంలో ఉంటే ప్రతి రోజూ ఉదయం 7 గంటలకు శాఖకు వెళ్లి అక్కడ శారీరిక, మానసిక శిక్షణ పొందడం, చివరిగా 8 గంటలకు ప్రార్థన చేయడం వారికి అలవాటు. అయితే ఈ రోజు తాము ప్రతిరోజూ ప్రార్థన చేసే సమయానికి వారు నట్టనడి సముద్రంలో ఓ పడవలో ఉన్నారు. ప్రార్ధన సమయం అయిందన్న సంగతి వారికి జ్ఞప్తికి వచ్చింది. వెంటనే ఆ నడిసంద్రంలోనే పడవలో వరుసలలో నిల్చుని పడవ ముందు భాగంలో కాషాయ ధ్వజాన్ని ఎగురవేశారు. శాఖలో మాదిరిగానే భక్తిగా ధ్వజప్రణామ్ చేసి ప్రార్థన చేశారు. ఈ మొత్తం కార్యక్రమాన్ని పక్క పడవలో నుంచి గమనిస్తున్న వారి సహచర మత్స్యకారులకు ఇది అబ్బురంగా తోచింది. వారిలో ఒకరు వెంటనే తన సెల్ ఫోన్ కెమెరాతో ఆ అద్భుత దృశ్యాన్ని చిత్రీకరించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ స్వయంసేవకుల నిబద్ధతకు మరో సజీవ సాక్ష్యం లభించింది. వారిలో ఒక స్వయంసేవక్ తో VSK ప్రతినిధి దీనిపై సంభాషించినప్పుడు తమకు ఇది సహజమేనని, ఈ విధంగా సముద్రంలో వేటకి వెళ్ళినప్పుడు శాఖకు సమయం అయితే తాము ఇదేవిధంగా పడవలోనే ప్రార్థన చేస్తూ ఉంటామని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.