
చెన్నై: పద్మభూషణ్ పురస్కార గ్రహీత డాక్టర్ ఆర్.నాగస్వామి చెన్నైలోని తన నివాసంలో ఆదివారం కన్నుమూశారు. ఆయన వయస్సు 91 ఏళ్ళు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్.) ఆయనకు ఘన నివాళులర్పించింది. నాగస్వామి భారతీయ కళలో అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు పొందారు. ప్రాచీన శిలాశాసనాలు, వాస్తుశిల్పం, శిల్ప కంచులు, పెయింటింగ్‌లు, న్యూమిస్మాటిక్స్, మతం, తత్వశాస్త్రం, ఆలయ ఆచారాలు, సంగీతం, నృత్యం తదితర కళల్లో నిష్ణాతుడు.
లండన్ కోర్టులో పట్టూరు నటరాజా కేసును గెలవడానికి స్వామి కళానైపుణ్యం ఎంతో దోహదపడింది. భారతదేశం, దాని చరిత్ర, తమిళ సంస్కృతిపై గట్టి సాక్ష్యాలను చూపారు. న్యాయమూర్తులు కూడా అతని “అప్పీల్ చేయలేని” వాదనలకు తలొగ్గారు. అంతేకాదు.. రామ జన్మభూమి కేసులో 26 రోజుల పాటు సాక్ష్యాలను అందించడం ద్వారా కీలక పాత్ర పోషించారు. ఇది వివాదాస్పద కట్టడం కింద ఆలయం ఉందని నిరూపించడంలోనూ, భారత పురావస్తు సంఘం తవ్వకాల నుండి అందిన ఆధారాలకూ సహాయపడింది. ప్రపంచ ప్రఖ్యాత నాట్యాంజలి నృత్యోత్సవాన్ని స్థాపించిన వారిలో డాక్టర్ నాగస్వామి ఒకరు. అతను శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి విశ్వ మహావిద్యాలయ మొదటి వైస్ ఛాన్సలర్. సెక్కిలర్ రీసెర్చ్ సెంటర్ చెన్నై, తమిళనాడు ఆర్కియోలాజికల్ సొసైటీ, ఆర్ష విద్యా గురుకులం ఫెలో.
అతను తన చివరి శ్వాస వరకు భారతదేశ కళ, సంస్కృతిని రక్షించడానికి అవిశ్రాంతంగా పనిచేశారు. నాగస్వామి లేనిలోటు పూడ్చలేనిది. ఆయన కుటుంబ సభ్యులందరికీ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తోంది ఆర్‌ఎస్‌ఎస్. ఈ మేరకు సంఘ్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
Source: rss.org