News

ఫిబ్రవరి 5న మోదీ చేతుల మీదుగా ‘సమతా మూర్తి’ ఆవిష్కరణ

548views
  • చిన జీయర్‌ స్వామి వెల్లడి

భాగ్యనగరం: సామాజిక సంస్కరణలకు ఆద్యుడైన రామనుజాచార్యుల 1000వ జయంతి సందర్భంగా 216 అడుగుల ‘సమతా మూర్తి’ని ఫిబ్రవరి అయిదోతేదీన ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. అదే నెల 13న సమతా మూర్తిలోపల గర్భాలయాన్ని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ ప్రారంభించనున్నారు. ఈ మేరకు చినజీయర్‌ స్వామి ఆశ్రమం ఓ ప్రకటనను విడుదల చేసింది. హైదరాబాద్‌ ముచ్చింతల్‌లోని చినజీయర్‌ ఆశ్రమంలో 45 ఎకరాల విస్తీర్ణంలో సమతా మూర్తిని ఏర్పాటు చేయనున్నారు.

‘సమతా మూర్తి ఆవిష్కరణకు అన్ని వర్గాల వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ముఖ్య అతిథులు, ముఖ్యమైన వ్యక్తులు, భక్తులు, ప్రజలంతా వచ్చి సమతా మూర్తి ఆవిష్కరణను విజయవంతం చేయాలని కోరుతున్నాం. సమానత్వానికి రామానుజచార్యుల వారు వెయ్యేళ్లపాటు ప్రతీకగా నిలిచారు. ఆయన బోధనలను మరో వెయ్యేళ్ల పాటు జనాలకు తెలియజేప్పేందుకే ఈ ప్రాజెక్టును ఏర్పాటు చేశాం’ అని చినజీయర్‌ స్వామి తెలిపారు.

కాగా, కూర్చుని ఉన్న పొజిషన్‌లో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద విగ్రహంగా సమతా మూర్తి రికార్డుల్లోకి ఎక్కనుంది. కూర్చుని ఉన్న పొజిషన్‌లో అతిపెద్ద విగ్రహంగా థాయ్‌ లాండ్‌లోని బుద్ధుడి విగ్రహం పేరిట రికార్డుంది. రామానుజాచార్యుల విగ్రహాన్ని బంగారం, వెండి, రాగి, కంచు, జింక్‌ వంటి పంచలోహాలతో రూపొందించారు. విగ్రహం లోపల గర్భాలయాన్ని 120 కిలోల బంగారంతో నిర్మించారు. భూమిపై ఆయన 120 ఏళ్లు నడయాడినందుకు గుర్తుగా 120 కిలోల బంగారాన్ని వినియోగించారు. ప్రాజెక్టు కోసం రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులు ఇచ్చిన విరాళాలు, చందాలతో దానిని నిర్మిస్తున్నారు. 108 దివ్యదేశాలు, 108 విష్ణు ఆలయాలనూ ఇందులో నిర్మిస్తున్నారు.

Source: Ap7am

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి