
-
ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతరగా ప్రసిద్ధ
భాగ్యనగరం: ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనుంది. ఈ మేరకు మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం పూజారుల సంఘం నిర్ణయించింది. 2022లో జరగనున్న మహాజాతర తేదీలను ప్రకటించారు.
తెలంగాణ సుప్రసిద్ధ జాతర, గిరిజన ప్రజల ఆరాధ్య దేవతలు కొలువుదీరిన మేడారం జాతరకు కోటిన్నర మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే, కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో జాతర జరగనుండడంతో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పూజారుల (వడ్డెల) సమావేశం నిర్వహించి, 2022లో జరగనున్న మహాజాతర తేదీలను నిర్ణయించారు. ఈ మేరకు ఫిబ్రవరి 16న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకు వస్తారు. 17న మేడారం సమీపంలోని చిలుకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తీసుకువస్తారు.
18న అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 19న పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయియడంతో మహా జాతర ముగుస్తుందని పూజారులు తెలిపారు.





