
విజయనగరం: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు విజయనగరం జిల్లాలోని అన్ని మండలాల నుంచి 500 మంది దళితులు, గిరిజనులు బస్సుల్లో బయలుదేరారు. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచార పరిషత్, సమరసతా సేవా ఫౌండేషన్ సంయుక్తంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాయి. ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి బస్సుల్లో భక్తులు పయనమయ్యారు.
ఈ సందర్భంగా టీటీడీ జిల్లాశాఖ కో ఆర్డినేటర్ జోశ్యుల శ్యామ్ సుందర్ మాట్లాడుతూ జిల్లాలో ఎస్టీ, ఎస్సీ ప్రాంతాల్లో నిర్మించిన ఆలయాల పరిసరాల్లో గల దళిత, గిరిజనులకు ఈ సౌకర్యం కల్పించినట్టు తెలిపారు. భక్తులు శ్రీస్వామివారిని దర్శించుకునేందు పది బస్సులు ఏర్పాటు చేశామని, బస్సుకు 47 మంది చొప్పున సేవా ఫౌండేషన్‌కు చెందిన ఇద్దరికి దర్శనానికి అవకాశం కల్పించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో సేవా ఫౌండేషన్ ప్రతినిధి కె.నాగభూషణం, గుర్ల సేవా సమితి సభ్యుడు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.