News

మలయాళ చిత్రంలో ‘సేవా భారతి’ అంబులెన్స్‌ ప్రత్యక్షం!

1.6kviews
  • చిందులేస్తున్న మతోన్మాదులు

  • విమర్శలను తిప్పికొట్టిన నటుడు, దర్శకుడు, ఐఎంకే

కేరళ: మెప్పడియాన్‌ అనే మలయాళ చిత్రంలో ప్రముఖ స్వచ్ఛంద సంస్థ సేవా భారతికి చెందిన అంబులెన్స్‌ వినియోగించారు. దీనిని ఓర్వలేని మతోన్మాదులు విమర్శలు గుప్పిస్తూ మరోసారి తమ నైజాన్ని చాటుకున్నారు.

ఈ సినిమా ఈ నెల 14న విడుదలైంది. సినిమాలో సేవా భారతి అంబులెన్స్‌ని, హనుమంతుడి విగ్రహాన్ని దర్శకుడు విష్ణు మోహన్‌ వినియోగించుకున్నారు. చిత్రంలో నటుడు ఉన్ని ముకుందన్‌ను గొప్ప హిందువుగా చిత్రీకరించినందుకు అక్కడి ప్రేక్షకులు పలు రకాలుగా విమర్శిస్తున్నారు. దీనికి ఇందు మక్కల్‌ కట్చి(ఐఎంకే) అనే హిందూ నేషనలిస్ట్‌ పార్టీ స్పందించింది. మతోన్మాదుల ద్వేషపూరిత ప్రచారాన్ని తిప్పికొడుతూ ఓ కథనాన్ని ట్వీట్‌ చేసింది.

‘గర్వించదగిన హిందూ నటుడు ఉన్ని ముకుందన్‌ తాజా చిత్రం మతపరమైనదిగా ఉందని అబ్రహామిక్‌/కమీ చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు’ అని ట్వీట్‌ చేసింది. విమర్శలకు అనేక కారణాలను పేర్కొంటూ, ఈ చిత్రం హిందువులను ఎగతాళి చేయడాన్ని సమర్ధించదని, గర్వించదగిన ప్రతి హిందువుతో సంబంధం కలిగి ఉండే సాధారణ కథ అని ఆ ట్వీట్‌లో జోడిరచింది.

అయితే, ఉన్ని ముకుందన్‌ రెండు సన్నివేశాల ద్వారా ప్రజలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని పౌరులలో ఒక వర్గం పేర్కొంది- ఒకటి, సేవా భారతి అంబులెన్స్‌ని ఉపయోగిస్తున్నారు. రెండోది నటుడు హనుమంతుని విగ్రహంతో పోజులిచ్చాడు.. అని!

ఇదిలావుండగా, సేవా భారతి గిరిజన, స్థానిక వర్గాలతో సహా భారతీయ సమాజంలోని బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థ. కేరళలో ఇప్పటికే ఉన్న ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను ప్రోత్సహిస్తూ, మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు వైద్య సహాయం అందించడానికి అంబులెన్స్‌ సేవలను కూడా నిర్వహిస్తోంది.

హనుమంతుడి పాత్ర తప్పు అనిపించలేదు: నటుడు ఉన్ని ముకుందన్‌

కొంతమంది అదే పనిగా చేస్తున్న విమర్శలకు నటుడు ఉన్ని ముకుందన్‌ స్పందించారు. ముకుందన్‌ ఒక ఇంటర్వ్యూలో సేవా భారతి అంబులెన్స్‌ చిత్రీకరణలో తప్పుగా భావించలేదని పేర్కొన్నాడు. సమాజంలోని ఒక వర్గం ద్వేషపూరిత ప్రచారాన్ని వ్యాప్తి చేయడం, కళాత్మక స్వేచ్ఛను కించపరచడం బాధాకరం అని ఆయన అన్నారు.

‘కొన్ని దశాబ్దాలుగా భారతదేశంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ సేవా భారతి. ఉచిత అంబులెన్స్‌ సేవలను అందిస్తుండడంతోపాటు ఆర్థిక సమస్యలలో చిక్కుకున్న సామాన్యుడి స్థితిగతులను తెలుపుతుందీ చిత్రం’ అని నటుడు పేర్కొన్నాడు. అంతేకాదు.. సేవా భారతి అంబులెన్స్‌ను ఉపయోగించడాన్ని రాజకీయ ప్రకటనగా పరిగణించలేమని స్పష్టం చేశారు.

‘లార్డ్‌ హనుమాన్‌’ ట్రోల్‌ గురించి మాట్లాడుతూ, ‘నా చిన్నప్పటి నుండి హనుమాన్‌ స్వామి నాకు స్ఫూర్తి. నేను ఫిజికల్‌ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే వ్యక్తిని.. నాకు హనుమాన్‌ స్వామి రోల్‌ మోడల్‌. ప్రజలు ప్రతిదాన్ని ప్రతికూల కోణంలో ఎందుకు తీసుకుంటున్నారో నాకు నిజంగా తెలియదు. నేను సినిమాలో చేసిన దానికి స్పష్టమైన కారణం ఉంది’ అని ముకుందన్‌ పేర్కొన్నారు.

ఆపద్భాందవి… సేవాభారతి : దర్శకుడు విష్ణు మోహన్‌

మెప్పడియాన్‌ సినిమాపై వస్తున్న విమర్శలకు సినిమా దర్శికుడు విష్ణు మోహన్‌ కూడా స్పందించారు. విపత్తుల గురించి సినిమా తీస్తున్నప్పుడు సేవా భారతిని ఉపయోగించకుండా వదిలివేయలేము. వారి అంబులెన్స్‌ని ఉపయోగించడంలో తప్పు ఏమిటి? అని విష్ణు మోహన్‌ ఎదురుప్రశ్న సంధించారు. అంతేకాదు.. సినిమా షూటింగ్‌ కొవిడ్‌ టైమ్‌లో ఉన్నందున అంబులెన్స్‌లన్నీ బిజీగా ఉన్నాయి… షూట్‌ కోసం అంబులెన్స్‌ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నవారు పెద్ద మొత్తంలో డిమాండ్‌ చేశారు. ఈ పరిస్థితుల్లో సేవాభారతి అంబులెన్స్‌ను ఉచితంగా అందించడానికి సిద్ధంగా ఉండడంతో వినియోగించుకున్నామని తెలిపారు.

కేరళ రాష్ట్రానికి విపత్తుల సమయంలో సహాయం అవసరమైన ప్రతిసారీ సేవాభారతి ముందుకు వచ్చిందని దర్శకుడు ఈ సందర్భంగా గుర్తుచేశారు. ‘విపత్తుల సమయంలో పోలీసులు, ఫైర్‌ ఫోర్స్‌ కంటే ముందుగా ‘సేవాభారతి’ చేరుకుంటుందని నేను చూశాను. ఈ సంగతి కేరళలో ఎవరికి తెలియదు? అవి లేకుండా సినిమా ఎలా తీయగలం?’ అని అన్నారు.

సేవా భారతి అనే స్వచ్ఛంద సేవా సంస్థ ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటోంది. ఉచితంగా విద్య, వైద్య, వృత్తి శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కొట్టాయం సమీపంలోని ఒక చిన్న పట్టణంలో తన కుటుంబంతో నివసించే సామాన్య వ్యక్తి జయకృష్ణన్‌(ఉన్ని ముకుందన్‌) చుట్టూ సినిమా తిరుగుతుంది. అతను నిరంతరం ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటుండగా, విలన్‌ ఫిలిప్‌ (సైజు కురుప్‌) అతనిని భూమి ఒప్పందంలో ట్రాప్‌ చేయడంతో జయకృష్ణన్‌ జీవితం తలకిందులు అవుతుంది. ఇదీ కథ.

ఈ చిత్రానికి విష్ణు మోహన్‌ దర్శకత్వం వహించారు. ఉన్ని ముకుందన్‌ ఫిలింస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ నిర్మించింది. నీల్‌ డి కున్హా దాని డిఓపిగా, షమీర్‌ ముహమ్మద్‌ ఎడిటర్‌గా ఉన్నారు.

Source: Opindia

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి