NewsProgramms

విజయవాడలో సేవా భారతి `ఆత్మీయ సమ్మేళనం`

640views

సేవా భారతి “విద్యార్థి వికాస యోజన” ద్వారా చదువుకుంటున్న, వృత్తి ఉద్యోగాలలో స్థిరపడిన సుమారు 90 మంది యువతీ యువకుల ఆత్మీయ సమ్మేళనం 19/12/2021, ఆదివారం, సాయంత్రం 4 గంటలకు విజయవాడ, సత్యనారాయణపురంలోని విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగింది.

సేవా భారతి మొదటిగా తూర్పుగోదావరి జిల్లాలో బాగా వెనుకబడిన, ప్రస్తుతం పోలవరం ముంపు మండలాలుగా ఉన్న చింతూరు, వరరామ చంద్రాపురం, కూనవరం, వేలేరుపాడు మండలాలతో పాటు కుక్కనూరు, భద్రాచలం, ఎటపాక మండలాలలో గల సుమారు 200 మారుమూల గ్రామాలలోని ప్రజలకు పౌష్టికాహారాన్ని అందించడంతోపాటు, వైద్య సౌకర్యాలు కల్పించటం, అసలు బడికే వెళ్లకుండా బాల్యం నుంచి పశువుల కాపర్లుగా, వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ ఉండిన బాలబాలికలతో పాటు, కొంతకాలం బడికి వెళ్ళి వివిధ కారణాలతో బడి మానేసి బాలకార్మికులుగా పనిచేస్తుండిన బాల బాలికలను గుర్తించి, వారితో, వారి తల్లిదండ్రులతో మాట్లాడి, బుజ్జగించి, ఒప్పించి వారికి బ్రిడ్జి కోర్సుల ద్వారా పునశ్చరణ తరగతులు నిర్వహించి వారిని పాఠశాలలలోనూ, కళాశాలలలోనూ చేర్పించి, వసతి, భోజనం, దుస్తులు, పుస్తకాలు, పాఠశాల ఫీజులు వంటి సకల సౌకర్యాలూ కల్పించి వారు విజయవంతంగా వారి చదువును పూర్తి చేసి, ఏవేని వృత్తి ఉద్యోగాలలో స్థిరపడే వరకు వారికి పెద్దదిక్కుగా, అండదండగా నిలచింది సేవాభారతి. ఆ విధంగా విద్యార్జన చేస్తున్న, జీవితంలో స్థిరపడిన వారిలో ఎక్కువమంది బాగా వెనుకబడిన కొండరెడ్డి, కోయ కులస్తులే. ప్రస్తుతం సేవాభారతి ఆధ్వర్యంలో చింతూరులో నడుస్తున్న ఆసుపత్రి ఆ చుట్టుప్రక్కలి నలభై గ్రామాల ప్రజలకు కేవలం రూ.10/-లకే వైద్య సేవలందిస్తోంది. కొండరెడ్డి కులస్తులకైతే పూర్తి ఉచితం. ఆ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఓ మొబైల్ వ్యాన్ ద్వారా కూడా ఆ చుట్టుప్రక్కలి మారుమూల గ్రామాలకు ఉచిత వైద్యసేవలు నిర్విరామంగా అందుతున్నాయ్.

వేదికపై డా. మురళీకృష్ణ, శ్రీ శ్రీనివాసరాజు, డా. శాయికిశోర్, డా. P. S. రావు, శ్రీ ఓంకార నరసింహం

సేవాభారతి ప్రయత్నంతో ఆ గ్రామాలలో ప్రస్తుతం పరిస్థితులు ఎంతో మెరుగుపడ్డాయ్. ప్రజల ఆర్ధిక, ఆరోగ్య స్థితిగతులలో గణనీయమైన మార్పులొచ్చాయ్. విద్యాగంధం అంటడం, ఆరోగ్యము, కుటుంబ పరిస్థితులు, ఆర్ధిక స్థితిగతులపై అవగాహన గ్రామీణులను వ్యసన ముక్తులనుజేసింది. కొన్ని సామాజిక దురాచారాలు కూడా దూరమయ్యాయి.

సేవాభారతి కృషికి ‘విద్యామిత్ర ట్రస్ట్’, హైదరాబాద్ వారి ఆర్ధిక సహకారం తోడయ్యింది. సేవాభారతి చేసిన, చేస్తున్న సేవాకార్యక్రమాలకు లభిస్తున్న ఆర్ధిక సహకారంలో సింహభాగం విద్యామిత్ర ట్రస్ట్ దే. సేవాభారతి ఆధ్వర్యంలో 2004లో బాల కార్మిక పాఠశాల ప్రారంభమైంది. ఆ విధంగా ఇప్పటివరకూ సేవాభారతి ఒడి చేరిన 600 మంది బాలబాలికలు… కొందరు ఉన్నత విద్యనభ్యసిస్తూ ఉండగా….. సుమారు 70 మంది యువతీ యువకులు పలు వృత్తి, ఉద్యోగాలలో స్థిరపడ్డారు.

సేవాభారతి ద్వారా విద్యనభ్యసిస్తున్న పిల్లలు జీవితంలో తేలికగా స్థిరపడేలా వారికి 2008 నుంచి Auxiliary Nursing Midwifery (A.N.M.), General Nursing and Midwifery (GNM), Multi Purpose Health Worker (M.P.H.W.), B.Sc Nursing వంటి వృత్తి విద్యా కోర్సులలో శిక్షణనిప్పించారు. అలా శిక్షణ పొందిన యువతీ యువకులు సుమారు 50 మంది తూర్పు గోదావరి జిల్లాలోని తుని సమీపంలోని కృష్ణవరం నుంచి గోదావరి ఒడ్డునున్న జీడిగుప్ప గ్రామం వరకు ఉన్న వివిధ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలోనూ, కిమ్స్, అపోలో, బసవరామతారకం క్యాన్సర్ హాస్పిటల్, ఏషియన్ గ్యాస్ట్రో ఎంటరాలజీ సెంటర్ వంటి ప్రతిష్ఠాత్మక ఆసుపత్రులలో పనిచేస్తున్నారు. 2008 లో 8 మందితో ప్రారంభమైన వృత్తివిద్యా కోర్సుల శిక్షణ ప్రస్తుతం 80 మందితో నడుస్తోంది.

సేవాభారతి అక్కున చేర్చుకున్న కన్నరాజు ప్రస్తుతం ఓ ఇంజనీర్. కోయ కులానికి చెందిన కిరణ్ ప్రస్తుతం ముంబైలో ఓ ఉన్నత ఉద్యోగంలో ఉన్నాడు. కొండరెడ్డి కులానికి చెందిన కళ్యాణ్ రెడ్డి SBI లో పనిచేస్తున్నాడు. రాంబాబు అగ్రికల్చర్ డిపాట్మెంట్లో ఇంజనీర్. శివాజీ ఉపాధ్యాయుడు. ఇలా సేవాభారతి అవిరళ కృషి కారణంగా ఎందరో యువతీయువకులు ప్రయోజకులై జీవితంలో అత్యున్నతంగా స్థిరపడ్డారు. సేవాభారతి ద్వారా లభించిన అత్యున్నత సంస్కారం కారణంగా అత్యంత ఆదర్శవంతంగానూ జీవిస్తున్నారు. అంతేకాదు తాము జీవితంలో స్థిరపడ్డాక మరికొందరు బాలబాలికలకు భవిష్యత్తును ప్రసాదించటానికి సేవాభారతికి చేయూతనందిస్తున్నారు. ఈ సంస్కారం తమకు సేవాభారతి పెద్దల ద్వారానే లభించిందని వారు వినమ్రంగా చెప్పుకుంటారు కూడా.

ఆ విధంగా సేవా భారతి “విద్యార్థి వికాస యోజన” ద్వారా చదువుకుంటున్న, వృత్తి ఉద్యోగాలలో స్థిరపడిన సుమారు 90 మంది యువతీ యువకుల ఆత్మీయ సమ్మేళనం విజయవాడ, సత్యనారాయణపురంలోని విజ్ఞాన విహార ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి సేవాభారతి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సాయికిశోర్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా శ్రీ సాయి కిశోర్ మాట్లాడుతూ సేవాభారతి అందించిన చేయూతను అందుకుని జీవితంలో స్థిరపడిన ఈ యువతీయువకులందరూ అదృష్టవంతులని, సేవాభారతి ద్వారా పొందిన సంస్కారాన్ని ఆజన్మాంతమూ పాటించి జీవితంలో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.

విద్యాభారతి ప్రాంత కార్యదర్శి శ్రీ ఓంకార నరసింహం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో గత 20 సంవత్సరాలుగా ఈ కార్యాన్ని ముందుండి నడిపిస్తున్న డాక్టర్ మురళీకృష్ణ గారిని శ్రీకృష్ణునిగానూ, చింతూరు ఆసుపత్రిలో వైద్యసేవలందిస్తున్న డాక్టర్ ప్రసాద్ గారిని అర్జునుడిగానూ, తూర్పుగోదావరి జిల్లాలోని మారుమూల గ్రామాలలో సేవాభారతి ట్యూషన్ సెంటర్లను నిర్వహిస్తున్న శ్రీ ముత్తయ్య గారిని హనుమంతుడిగానూ అభివర్ణించారు.

తన అనుభవాలను వివరిస్తున్న సేవాభారతి పూర్వ విద్యార్థి శ్రీ రాంబాబు (ప్రస్తుతం ఇరిగేషన్ ఇంజనీర్)

బాలికల నృత్య ప్రదర్శనలు

ఆరోగ్యభారతి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు డాక్టర్ పి. ఎస్. రావు గారు మాట్లాడుతూ “ప్రస్తుతం యువత తీరుతెన్నులు చూసి నేనెప్పుడూ సహజంగా ఆవేదన చెందుతూ వుంటాను. ఇప్పుడు ఈ పిల్లల్ని చూసిన తర్వాత, వారితో మాట్లాడిన తర్వాత, వారి సంస్కారాన్ని దర్శించిన తర్వాత నాలో ఆ దిగులు నశించింది. ఈ పిల్లల్ని చూసి నేను గర్విస్తున్నాను. భారతదేశ భవిష్యత్తుపై భరోసాగా ఉన్నాను.“ అని పేర్కొన్నారు.

అనంతరం ఆర్. ఎస్. ఎస్ ప్రాంత కార్యకారిణి సభ్యులు శ్రీ భూపతిరాజు శ్రీనివాసరాజు మాట్లాడుతూ సేవాభారతి కార్యక్రమం మొదట మధ్యప్రదేశ్ లో ప్రారంభమైందని తెలిపారు. సేవాభారతి ద్వారా ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,50,000 సేవా ప్రకల్పాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పిల్లలందరూ వారి కుటుంబానికి, గ్రామానికి, సమాజానికి, దేశానికి వెలుగునిచ్చే దివ్వెలు కావాలని ఆకాంక్షించారు.

చెక్కును అందజేస్తున్న శ్రీమతి నార్ల రత్నకుమారి, శ్రీ భరత్

‘విద్యార్థి వికాస యోజన’ ద్వారా జీవితంలో స్థిరపడిన యువతీ యువకులు ఈ సందర్భంగా తమ అనుభవాలను ఆహూతులతో పంచుకున్నారు. ఆరోగ్య భారతి అఖిల భారత అధ్యక్షులు డాక్టర్ మురళీ కృష్ణ మరియు సేవాభారతి, ఆరోగ్యభారతి కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా శ్రీమతి నార్ల రత్నకుమారి సేవాభారతి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సాయి కిశోర్ గారి చేతికి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో పాల్గొన్న పెద్దల చేతులమీదుగా పిల్లలందరికీ వస్త్రాలను బహూకరించారు. ఆనందోత్సాహాల మధ్య కార్యక్రమం ముగిసింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.