News

ఎంపీలందరూ చట్టసభలకు హాజరు కావాల్సిందే…

614views
  • గైర్హాజరుపై ఘాటుగా స్పందించిన మోడీ

న్యూఢిల్లీ: పార్లమెంటు సమావేశాలకు బీజేపీ ఎంపీల గైర్హాజరుపై ప్రధాని నరేంద్రమోదీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభకు సక్రమంగా హాజరయ్యే వారికే 2024 ఎన్నికల్లో మళ్లీ పార్టీ టికెట్లు వస్తాయని పరోక్షంగా హెచ్చరించారు. మంగళవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో మోదీ మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలని తాను తరచూ చెబుతున్నానని, అయినా ఎంపీల వైఖరిలో మార్పు రావడం లేదని అన్నారు.

‘‘చిన్నపిల్లలకు చెప్పినట్లు మీకు చెప్పడం బాగుండదు. మీలో మార్పు రాకపోతే భవిష్యత్తులో మార్పులు తప్పవు’’ అని మోదీ హెచ్చరించారు. దీంతో సిటింగ్‌ ఎంపీలకు వారి పనితీరు, పార్లమెంటులో హాజరు ఆధారంగానే తిరిగి టికెట్లు లభిస్తాయన్న విషయాన్ని ప్రధాని పరోక్షంగా చెప్పారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

సమావేశంలో అంతకుముందు మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి కూడా.. సభలో రెండుసార్లు కోరమ్‌ లేకపోవడంతో ఎంపీలను పిలిపించాల్సి వచ్చిందని చెప్పారు. ఇక ఎంపీలందరూ తమ నియోజకవర్గాల పరిధిలోని బీజేపీ జిల్లా, మండల అధ్యక్షులను తేనీటి విందుకు పిలవాలని జేపీ నడ్డా సూచించారు. ప్రధాని మోదీ తన నియోజకవర్గమైన వారాణసీ పరిధిలోని జిల్లా పార్టీ, మండల పార్టీ అధ్యక్షులతో ఈ నెల 14న సమావేశం కానున్నారని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి