
-
దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కొవిడ్ పాజిటివ్!
సంతబొమ్మాలి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది. తాజాగా ఆంధ్రాలోని శ్రీకాకుళం జిల్లాలో టెన్షన్ నెలకొంది. సంతబొమ్మాలి మండలం ఉమిలాడ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. బాధితుడు ఇటీవలే దక్షిణాఫ్రికా నుంచి జిల్లాకు వచ్చాడు. దీంతో జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు.
ఉమిలాడ గ్రామానికి చేరుకున్న వైద్యాధికారులు అతనికి వైద్య పరీక్షలు నిర్వహించారు. దీంతో అతనికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయ్యింది. తిరిగి 14 రోజుల అనంతరం మళ్లీ కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు నిర్వహించగా, మళ్లీ కరోనా పాజిటివ్ రావడంతో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఒమిక్రాన్ అనుమానంతో పరీక్షలు నిర్వహిస్తున్నారు. శాంపిల్స్ ను రిమ్స్ మెడికల్ కాలేజీకి పంపించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ చేసిన తర్వాత గానీ దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదని అధికారులు చెబుతున్నారు.
అయితే, ఒమిక్రాన్ వేరియంట్ జిల్లాలో వచ్చిందనే టెన్షన్ మాత్రం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతోంది. కరోనా బాధితుడు గత నెల 23వ తేదీన దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్టు సమాచారం. అతను వచ్చిన వెంటనే టెస్టు చేసినప్పటికీ నెగెటివ్ వచ్చింది. అయితే, ఆయన కొద్ది రోజుల తర్వాత అనారోగ్యానికి గురయ్యారు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టులు చేయగా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.
ఇదిలావుంటే, జిల్లా వాసులు ఎటువంటి భయాందోళనలో పడాల్సిన అవసరం లేదని జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి బగాది జగన్నాథం భరోసా ఇచ్చారు. ఆ వ్యక్తికి రెండుసార్లు కరోనా నిర్ధారణ వైద్య పరీక్షలు చేసాం. రక్త నమూనాలను జినోమ్ సీక్వెన్స్‌కి పంపించామని, పూర్తి నివేదికలు వస్తే గానీ ఒమిక్రాన్‌గా నిర్ధారించలేమని ఆయన తెలిపారు.
Source: Tv9





