
-
భద్రత పెంచిన కన్నడ ప్రభుత్వం
బెంగళూరు: అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ‘ఐఎస్‌ఐఎస్’ కన్ను భారత దేశంలోని హిందూ దేవుళ్ళపై పడింది. ‘ఐసిస్’ నిర్వహిస్తున్న ఇండియా-సెంట్రిక్ ఆన్‌లైన్ ప్రచార మ్యాగజైన్‌లో శిరచ్ఛేదం చేయబడిన శివుడి విగ్రహం ఫోటోను పోస్ట్ చేసింది. అంతేకాదు… హిందూ దేవత విగ్రహాలను ధ్వంసం చేయాలంటూ పిలుపునిచ్చింది. ఈ ఫోటో వైరల్‌గా మారింది. ఐఏఎన్‌ఎస్ సమాచారం ప్రకారం.. ఈ విగ్రహం కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలోని మురుడేశ్వర నగరంలోని బీచ్‌లో ఉన్న 123 అడుగుల ఎత్తైన ప్రసిద్ధి చెందిన శివుడుగా తెలుస్తోంది. ఈ క్షేత్రం ప్రసిద్ధ శివ పుణ్యక్షేత్రం. ఐసిస్ తన మ్యాగ్ జైన్‌పై శివుడి తల తీసేసి, తమ జెండాను ఎగురవేసిన ఉన్న ఫోటోని పోస్ట్ చేసింది. ఈ ఫోటో తీవ్ర వివాదస్పదమైంది. ఇది తీవ్రవాదుల దుశ్చర్య అంటూ ఐసీస్‌పై భారతీయులు, హిందుత్వవాదులు మండిపడుతున్నారు.

ప్రముఖ విశ్లేషకుడు అన్షుల్ సక్సేనా తన ట్విట్టర్ ఖాతాలో ఈ చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఉగ్రవాద సంస్థకు చెందిన ఆన్‌లైన్ ప్రచార మ్యాగజైన్ ‘ది వాయిస్ ఆఫ్ హింద్’ కవర్ పేజీగా శిరచ్ఛేదం చేసిన శివుడి విగ్రహం.. ఆ తల స్థానంలో ఐసిస్ జెండా ఉన్నట్టు ఆ ఫోటో ఉంది. అన్షుల్ మురుడేశ్వర పట్టణంలో భద్రతను పెంచాలని సక్సేనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీంతో కర్ణాటక ప్రభుత్వం మురుడేశ్వర ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా, మురుడేశ్వర తీర పట్టణం భత్కల్ పట్టణానికి చాలా సమీపంలో ఉంది. ఈ భత్కల్ పట్టణం భారత ఇంటెలిజెన్స్ ఏజెన్సీల నిరంతర పర్యవేక్షణలో ఉంది. ఉగ్రవాది యాసిన్ భత్కల్ ఈ నగరానికి చెందినవాడే.
Source: Tv9





