-
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
భాగ్యనగరం: హక్కుల కంటే ముందు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని శ్రీరాముని జీవితం తెలియజేస్తోందని ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పేర్కొన్నారు. భారతీయ సంస్కృతికి చుక్కానిగా నిలిచిన రామాయణం, శ్రీరాముని జీవితాలను నుంచి యువత స్ఫూర్తి పొందాలని ఆకాంక్షించారు. హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికారి కొమండూర్ శశికిరణ్ రచించిన శ్రీమద్రామాయణం పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈతరం యువతకు అర్థమయ్యే విధంగా సులభమైన పదాలతో, పద్యాల రూపంలో రామాయణాన్ని రచించిన రచయితను, ప్రచురించిన ఎమెస్కో బుక్స్కు ఆయన అభినందనలు తెలిపారు.
రామాయణాన్ని మతానికి చెందిన గ్రంథంగా చూడడం తగదన్న ఆయన, విద్యార్థులకు పాఠ్యప్రణాళికలో భాగంగా రామాయణాన్ని బోధించాలని సూచించారు. మన గ్రంథాలను సరైన వారిద్వారా, సరైన మార్గంలో తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకమన్నారు. నాయకత్వ లక్షణాలు, నిర్వహణా చాతుర్యం, సుపరిపాలన, వనరులను సరైన విధంగా వినియోగించుకునే సామర్థ్యం, వ్యాపార సంబంధాలను, వ్యూహాత్మక పరిచయాలను పెంపొందించుకోవడం వంటి విజయానికి అవసరమైన వృత్తి పరమైన కీలక నైపుణ్యాలను శ్రీరాముని గాధ మనకు బోధిస్తుందని తెలిపారు.