ArticlesNews

సమతా రథ సారధి గురునానక్

61views

భారతదేశ సాధు పరంపరలో ఒకరు. సిక్కు మతస్థాపకుడు. సిక్కుల ప్రథమగురువు కూడా. వేదాంత సారాన్నంతటినీ శుద్ద దేశభాషలో, ప్రజల వ్యావహారిక భాషలో తెలియజెప్పినవాడు. గురునానక్ క్రీ.శ. 15 వ శతాబ్దంలో కార్తీక పూర్ణిమ రోజు పంజాబ్ లో నేటి పాకిస్తాన్ లోని తలవండి అనే గ్రామంలో జన్మించాడు. ఆ గ్రామాన్నే నేడు నన్ కానా సాహిబ్ అని పిలుస్తున్నారు. తండ్రి మెహతా కాలూరాం పట్వారి. తల్లి తృపాదేవి. నానక్ భార్య పేరు సులక్షణ. వారికి శ్రీ చంద్ర, లక్ష్మీదాసులనే ఇద్దరు పుత్రులు జన్మించారు.

నానక్ చిన్న నాటి నుండి ఆధ్యాత్మిక భావాలు కలిగి ఉండేవాడు. వారి దృష్టి ఎక్కువగా సాధు సన్యాసుల మీద ఉంటుండేది. అందువలన గృహస్థాశ్రమం స్వీకరించిన తర్వాత కూడా సంసారం పట్ల విరక్తులై కుటుంబాన్ని త్యజించి తీర్థయాత్రలకు వెళ్లాడు. భారతదేశంలోని పుణ్యక్షేత్రాల తోపాటు శ్రీలంక, మక్కా మదీనా, కాబూల్ వంటి స్థానాలను సందర్శించారు. అనేక స్థలాలలో ధర్మశాలలు కట్టించాడు. వర్ణభేదాలను వ్యతిరేకించడం, ఏకేశ్వరోపాసన, ప్రేమతత్వం, భక్తిమార్గం ఆయన ముఖ్య సిద్ధాంతాలు.

నైతిక విలువలకు మిక్కిలి ప్రాధాన్యత నిచ్చాడు.  డాంబిక జీవనాన్ని నిరసించాడు. మానవులందరినీ సమానంగా చూసిన వాడు. భక్తి పరుడు. కల్మష ప్రపంచంలో నిష్కల్మషం గా ఉన్నప్పుడె ముక్తి లభిస్తుందని బోధించాడు. మనదేశంలో మహమ్మదీయ రాజులైన బాబరు దురాక్రమణలు, ఆయన చేసిన దౌష్ట్యాలకు సాక్షీభూతుడు. అందుకే బాబరును పాపాల పుట్ట అన్నాడు.

నానక్ ఈ సమయంలో సర్వ మానవ సౌభ్రాతృత్వాన్ని సగుణ, నిర్గుణోపాసన మార్గాన్ని చూపిస్తూ ధర్మం యొక్క మూల తత్త్వం వైపు దృష్టి కేంద్రీకరించేలా శ్రుతి, స్కృతులలోని విషయాలు, శాస్త్ర పురాణ గ్రంథాలలోని అంశాలు బోధిస్తూ ధర్మం వైపు ఆకర్షితులయ్యేలా చేసేవారు. పంజాబీ భాషలో ‘సిక్’ అంటే శిష్యుడు అని అర్థం. నానక్ చేసిన భోధనలు అనుసరించిన వారంతా సిక్కు మతస్థులైనారు.

సిక్కు గౌరవించే ధర్మ గ్రంథం గురు గ్రంథ సాహెబ్. దీనిలో గురునానక్ బోధనలన్నీ సంకలనం చేయబడి ఉన్నాయి. దీనిలో కబీర్, రవిదాస్, మీరా, నామదేవాది మహాపురుషుల భక్తి గీతాలు కూడా చేర్చబడి ఉన్నాయి. హిందూ ధర్మ సంస్కృతి రక్షణలో సిక్కు స్థానం అనుపమానమైనది. గురు నానక్ 1538 లో పరమపదించారు.
నేడు గురునానక్ 551వ జయంతి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.