
-
ఆర్‌ఎస్‌ఎస్ అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్
ధార్వాడ్(కర్ణాటక): కొవిడ్ థర్డ్‌వేవ్ దృష్ట్యా 10 లక్షల మంది స్వయం సేవకులకు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) శిక్షణ ఇచ్చిందని అఖిల భారతీయ ప్రచార్ ప్రముఖ్ సునీల్ అంబేకర్ వెల్లడించారు. జూలైలో ప్రాంత్ ప్రచారకుల సమావేశంలో ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ప్రణాళిక రూపొందిందని, దేశవ్యాప్తంగా 1.5 లక్షలకు పైగా ప్రదేశాలలో శిక్షణ కార్యక్రమాలు జరిగాయని తెలిపారు. మూడో వేవ్ లేకున్నా ఈ నెల జరుగనున్న కార్యకారి మండల బైఠక్‌లో పరిస్థితిని సమీక్షించడంతోపాటు ప్రిపరేషన్‌పై చర్చ జరుగుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. సంఘ్ అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశం ఈ నెల 28 నుండి అక్టోబర్ 30 వరకు ధార్వాడ్‌లోని రాష్ట్రోత్థాన విద్యా కేంద్రంలో జరుగనుంది. కార్యకారి మండల సమావేశంలో చర్చించాల్సిన అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సమావేశ స్థలంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సునీల్ అంబేకర్ పంచుకున్నారు.
కొంతకాలంగా బంగ్లాదేశ్‌లో హిందువులపై నిరంతరం దాడులు, హింసాత్మక ఘటనలు చోటుచేసుకుంటున్నాయని సునీల్ అంబేకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనలను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఖండిరచారని, ఈ సమావేశంలో హిందువులపై జరుగుతున్న హింసాత్మక ఘటనలపై చర్చించి, సభ్యుల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకుని తీర్మానాన్ని కూడా ఆమోదించే అవకాశం ఉందన్నారు.
స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశం అమృత మహోత్సవ్‌ను జరుపుకుంటుందని, ఈ సందర్భంగా దేశంలో పలు కార్యక్రమాలు జరగనున్నాయని అంబేకర్ తెలిపారు. దేశం ‘స్వా’ మేల్కొలుపు గురించి కూడా చర్చ జరుగుతుందని, తెలియని లేదా అంతగా తెలియని, స్వాతంత్య్ర సమరయోధుల గురించి సమాచారాన్ని కూడా సమావేశం ముందుకు తీసుకువస్తుందని చెప్పారు.
ఆర్‌ఎస్‌ఎస్ ఏడాదికి రెండుసార్లు ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తుందని సునీల్ తెలిపారు. అఖిల భారతీయ ప్రతినిధి సభ మార్చిలో నిర్వహించగా, కార్యకారి మండలి సమావేశం దసరా, దీపావళి మధ్య జరుగుతుందన్నారు. సమావేశంలో దాదాపు 350 మంది సభ్యులు ఉంటారని అంచనా వేశామని, ప్రాంత్, క్షేత్ర సంఘచాలక్‌లు, ప్రచారక్‌లు, కార్యవాహులు, అఖిల భారతీయ కార్యకర్త సభ్యులు, కొన్ని సంస్థల ఆర్గనైజింగ్ సెక్రటరీలు ఈ సమావేశంలో పాల్గొంటారని చెప్పారు.
గత సంవత్సరం నుండి జూలై వరకు, అన్ని సమావేశాలు ఆన్‌లైన్ మోడ్ ద్వారా లేదా తక్కువ సంఖ్యలో భౌతిక హాజరుతో జరిగాయని, ఇప్పుడు తొలిసారిగా కార్యకారి మండలి సమావేశం పూర్తిస్థాయిలో జరునుందని సునీల్ అంబేకర్ తెలిపారు. ప్రతినిధి సభ సమావేశంలో పనుల విస్తరణకు సంబంధించి ప్రణాళికను సవిస్తరంగా నిర్వహించడంతోపాటు ఈ అక్టోబర్ సమావేశంలో పనులపై సమీక్ష కూడా జరుగుతుందని చెప్పారు. దీంతో పాటు కార్యకర్తల అభివృద్ధిపై కూడా చర్చ జరగనుందన్నారు.
సంఘ్ 1925లో స్థాపించబడిందని, 2025లో సంఘ్ 100 ఏళ్ళు పూర్తి కానుందని అంబేకర్ తెలిపారు. ఈ దృష్ట్యా మూడేళ్ళ పని విస్తరణ వివరణాత్మక ప్రణాళిక తయారైందని, ఇది 2024 నాటికి పూర్తి అవుతుందని చెప్పారు. ఈ ప్రణాళికలో కూడా వివరంగా సమావేశంలో చర్చకు రానుందని, కార్యకారి మండలి సమావేశంలో శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 400వ జయంతి సందర్భంగా నిర్వహించాల్సిన కార్యక్రమాలపై కూడా చర్చ జరుగుతుందన్నారు. కార్యకారి మండలి సమావేశం ఈ నెల 28, గురువారం ఉదయం 09:00 గంటలకు రాష్ట్రోత్థాన విద్యా కేంద్రంలో, ధార్వాడ్‌లో ప్రారంభమవుతుందని, సమావేశంలో కరోనా ప్రోటోకాల్‌ను పాటిస్తారని అంబేకర్ తెలిపారు.
Source: rss.0rg





