
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ సంవత్సరం దసరా వేడుకలను జవాన్లతో కలిసి జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. దేశ సరిహద్దు ప్రాంతం లద్ధాఖ్‌లోని ద్రాస్‌లో సైనికులతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొని వారితో మాట్లాడనున్నారు. సాధారణంగా రాష్ట్రపతి దేశ రాజధాని నగరంలో జరిగే దసరా వేడుకల్లో పాల్గొంటుంటారు. అయితే, రాష్ట్రపతి రేపు, ఎల్లుండి జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లలో పర్యటించనున్నట్టు రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
నేడు ఆయన లేహ్‌లోని సింధు ఘాట్ వద్ద సింధు దర్శన్ పూజలో పాల్గొంటారు. సాయంత్రం జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో బలగాలతో కలిసి దసరా వేడుకల్లో పాల్గొంటారు. ఈ నెల 15న ద్రాస్‌లోని కార్గిల్ యుద్ధ స్మారకం వద్ద అమర జవాన్లకు నివాళులర్పించనున్నారు. అనంతరం ఆయన అధికారులు, జవాన్లతో కలసి దసరా పండుగ జరుపుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ వర్గాలు పేర్కొన్నాయి.