
-
వీహెచ్‌పీ డిమాండ్
న్యూఢిల్లీ: ‘భగవద్గీతను జాతీయ గ్రంథంగా ప్రకటించాలి. విలువలు తరగిపోకుండా ఉండేందుకు భగవద్గీత బోధనను, అభ్యాసాన్ని దేశంలోని అన్ని స్థాయిల విద్యల్లోనూ తప్పనిసరి చేయాలి’ అని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు పరిషత్ ప్రతినిధులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. అధికారులు అంకితభావంతో కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు ప్రభుత్వ కార్యాలయాల్లో భగవద్గీత పఠన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలని కూడా స్పష్టం చేస్తున్నది.
ఈ విషయమై, 15 మంది ఎంపీల బృందం త్వరలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌లను కలిసి వినతిపత్రం సమర్పించనున్నట్టు వీహెచ్‌పీ జాతీయ కార్యదర్శి ఆచార్య రాధాకృష్ణ మనోడి వెల్లడిరచారు. గీత బోధనలు సార్వత్రిక స్వభావం కలిగినవాని పేర్కొంటూ, వాటి బోధనల ప్రయోజనాల గురించి ఇప్పటికే స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని తెలిపారు.
‘భగవద్గీత మన దేశ సామాజిక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక విలువలను కాపాడగలదు. మన సమాజంలో విభజనలను అంతం చేస్తుంది… భారతదేశాన్ని మరింత బలోపేతం చేస్తుంది. భగవద్గీతను భారతదేశ జాతీయ గ్రంథంగా ప్రకటించాలని మేము డిమాండ్ చేస్తున్నాము’ అని వీహెచ్ పేర్కొంది.
ప్రభుత్వ సంస్థలలో నైతిక విలువల పతనం అవుతున్న దృష్ట్యా పక్షం రోజులకోసారి విధి నిర్వహణ పట్ల బలమైన కర్తవ్య భావనను పెంపొందించడానికి గీత క్రమానుగత పఠనాన్ని నిర్వహించాలని కూడా వీహెచ్‌పీ కోరుతున్నది. మైనారిటీ వర్గాల ఉపాధ్యాయులను కూడా భగవద్గీత బోధన-అభ్యాసం పరిధిలోకి తీసుకురావాలని మనోడి స్పష్టం చేశారు.
‘ఉపాధ్యాయుల విద్య, శిక్షణ పొందుతున్న వారందరికీ భగవద్గీత అధ్యయనం తప్పనిసరి చేయాలి. భగవద్గీతపై విద్యను భారతదేశంలోని ముస్లిం, క్రిస్టియన్ వర్గాలకు చెందిన ఉపాధ్యాయులందరికీ తప్పనిసరి చేయాలి’ అని ఆయన సూచించారు. ప్రతి ఉపాధ్యాయుడు తప్పనిసరిగా గీత అధ్యాయాలను అధ్యయనం చేయాలని, ఆయా అంశాలను వారు విద్యార్థులకు అందించాలని కూడా ఆయన పేర్కొన్నారు.
వీహెచ్‌పీ విశ్వ గీత సంస్థాన్‌కు నాయకత్వం వహిస్తున్న మనోడి, భగవద్గీతలోని 18 అధ్యాయాలు కూడా ఉపాధ్యాయుల శిక్షణా పాఠ్యాంశాలలో భాగం కావాలని చెప్పారు. ‘విశ్వ గీత సంస్థాన్ సమాజానికి మేధోపరమైన సామర్థ్యాన్ని అందించడంలో భాగంగా గీత ఉపయోగం గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళేందుకు ప్రయత్నిస్తుంది. గీతకు గుర్తింపు వచ్చే నిమిత్తం మా ముఖ్య అంశాలపై విస్తృత చర్చల కోసం మేము రాష్ట్రపతి, ప్రధానమంత్రిలను కలవడానికి సమయం కోరాము’ అని మనోడి చెప్పారు.
వరల్డ్ గీతా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, వీహెచ్‌పీ నాయకుడు, తగిన వేతనం చెల్లించినప్పటికీ ఉపాధ్యాయులలో తమ విధుల నిర్వహణ పట్ల అంకితభావం లేకపోవడం ఆందోళన కలిగిస్తుందని మనోడి అన్నారు. ‘నైతిక విలువలలో క్షీణత, విద్యలో సహితం ఇదే తరహా ధోరణి భారతదేశ వ్యవస్థీకృత మేధో వారసత్వానికి అవమానికరంగా ఉంటున్నది… తమ విధుల గురించి వారిలో అవగాహన కల్పించడానికి ఉపాధ్యాయుల శిక్షణలో గీతను తప్పనిసరి చేయాలి’ మనోడి కోరుతున్నారు.
Source: Nijamtoday





