ArticlesNews

తేనెలొలికే పలుకుల ‘చిలక’మర్తి లక్ష్మీనరసింహం

105views

“భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగ దూడలై యేడ్చుచుండ
తెల్లవారను గడుసరి గొల్లవారు.
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి”.

భారతీయులను అనేక బాధలకు, అవమానాలకు గురిచేస్తున్న ఆంగ్లేయుల దౌర్జన్యాలనూ, కుటిల రాజనీతిజ్ఞతనూ, దోపిడీ విధానాలను తీవ్రంగా దుయ్యబడుతూ బిపిన్ చంద్రపాల్ రాజమహేంద్రవరంలో 5 రోజులపాటు ఇచ్చిన ఉపన్యాస సారాంశానికి చిలకమర్తి ఇచ్చిన పద్యరూపమే ఇది. భారతీయతను పుణికిపుచ్చుకుంటూ ఆంగ్ల పాలకులపై నిప్పులు చెరిగిన కలం ఆయనది.”భరతఖండంబె యొక గొప్ప బందిఖాన” అంటూ నాటి దేశ పరిస్థితులను కళ్ళకు కట్టినవాడు శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం.

శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహం కవి, రచయిత, నాటక కర్త, పాత్రికేయుడు, సంఘ సంస్కర్త, విద్యావేత్త. 19వ శతాబ్దం చివర, 20వ శతాబ్దం ఆరంభ కాలంలో తెలుగు సాహిత్యాభివృద్ధికి, తెలుగు నాట ఆధునిక భావాల వికాసానికి పట్టుగొమ్మలైన వారిలో చిలకమర్తి ఒకరు. మహాకవి, కళాప్రపూర్ణ ఈయన బిరుదులు. ఇరవైరెండేళ్ళ వయస్సప్పుడు ఆయన రచించిన గయోపాఖ్యానం అనే నాటకం ప్రతులు లక్షకి పైబడి అమ్ముడుపోవటమనేది తెలుగు సాహిత్య చరిత్రలో అరుదైన విషయం.

లక్ష్మీనరసింహం 1867 సెప్టెంబర్ 26న పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలములోని ఖండవల్లి గ్రామములో ఒక బ్రాహ్మణ కుటుంబములో వెంకయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించారు.

ఆయన ప్రాథమిక విద్య వీరవాసరం, నరసాపురం పట్టణాలలో సాగింది. 1889లో రాజమండ్రి హైస్కూలులో, హైస్కూలు చదువు ముగిసింది. 1889 లో రాజమండ్రి ఆర్య పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా చేరారు. తరువాత ఇన్నీసు పేట స్కూలులోనూ, మునిసిపల్ హైస్కూలులోనూ విద్యాబోధన సాగించారు. తరువాత ఒక సంవత్సరం సరస్వతి పత్రిక సంపాదకునిగా పనిచేశారు. ఆపై ఉద్యోగం విరమించి 1899లో హిందూ లోయర్ సెకండరీ స్కూల్ స్థాపించి 9 సంవత్సరాలు నడిపారు. తరువాత ఈ పాఠశాల వీరేశలింగం ఉన్నత పాఠశాలగా మార్చబడింది. 30వ ఏటనుండి రేచీకటి వ్యాధికి గురైనా ఆయన శ్రమించి తన కంటిచూపుకున్న అవరోధాన్ని అతిక్రమించి రచనలు కొనసాగించారు. ఆయన రచనలు మొత్తం 10 సంపుటాలుగా ప్రచురింపబడ్డాయి.

తెలుగు సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలోనూ రచనలు చేశారు. శతకాలూ, కథలూ, ప్రహసనాలూ, జీవిత చరిత్రలూ, స్వీయ చరిత్ర, విద్యార్థుల కోసం పాఠ్యగ్రంథాలు, నాటకాలూ, నవలలు అన్నిటా తన ముద్ర వేశారు. ప్రముఖ నవలా రచయితగా “ఆంధ్ర స్కాటు” అన్న ఖ్యాతి గడించారు. నాటక రచనలో ప్రధానంగా గయోపాఖ్యానం (1890) లోని పద్యాలు నిత్యం తెలుగువాళ్ళ నాలుకల మీదే జీవిస్తుంటాయి.

చెన్నపట్నం (చెన్నై)లో జరిగిన కాంగ్రెస్ మహాసభలకు (1914) వెళ్లి ప్రముఖుల ఉపన్యాసాలకు ఉత్తేజితుడైన దేశాభిమాని. విజయనగరం, కృష్ణా తదితర ప్రాంతాలలో కాంగ్రెస్ సభలకు హాజరై ప్రజల్లో దేశభక్తి, స్వాతంత్య్ర కాంక్షను రేకెత్తించే రాజకీయ కార్యక్రమాలు నిర్వహించిన వ్యక్తి. సంస్కరణ భావాల ప్రచారంలో సాంప్రదాయ పీఠాధిపతుల ఆజ్ఞలను సైతం లెక్క పెట్టని సంస్కర్త. వీరి జీవితాన్ని పోలవరం జమీందారు, న్యాపతి సుబ్బారావు, కందుకూరి వీరేశలింగం గార్లు ప్రభావితం చేశారనవచ్చు. వీరేశలింగం తాత్వికతే చిలకమర్తిని సాహిత్యపరంగానూ ముందుకు నడిపించింది.

చిలకమర్తి నడిపించిన సరస్వతి మాసపత్రిక (1898), మనోరమ మాసపత్రిక (1906), దేశమాత వారపత్రిక (1909) ల్లో సాహిత్య, రాజకీయ వ్యాసాలుండేవి. ‘దేశమాత’ చందాదారులపై బ్రిటీష్ ప్రభుత్వం విధించిన ఆంక్షలకు నిరసనగా పత్రికనే ఆపేసి తిరగబడ్డారు చిలకమర్తి. “ధనమునకై బానిసగ నుండుట కిష్టపడలేదు” అని వ్రాసుకున్నారు.

స్త్రీవిద్య, వితంతు వివాహాల సమస్యలపై పోరాడిన వ్యక్తి. మతసామరస్యం కోసం కృషి చేశారు. నిమ్నజాతి ఉద్ధరణే ఆశయంగా 1909 లో హరిజనులకోసం ఒక విద్యాలయాన్ని నడిపారు. నిమ్నజాతుల వారి కోసం మొట్టమొదట ప్రత్యేకంగా ఒక పాఠశాలను స్థాపించిన ఘనత ఆంధ్రదేశంలో చిలకమర్తి వారికే దక్కుతుంది. ఎందుకంటే అంతకు మునుపు ప్రభుత్వంచే నడుపబడుతున్న ఒకటి రెండు పాఠశాలలు తప్ప దళితుల కోసం ప్రత్యేకమైన పాఠశాలలను ఎవరూ స్థాపించలేదు. కేవలం తన పుస్తకాలనుండి వచ్చిన రాబడితోనే, తన స్వంత ధనంతో ఆ రామమోహన పాఠశాలను 13 సంవత్సరాలు నడిపి హైయ్యర్ ఎలిమెంటరీ స్కూల్ గా చేశారు. ఎక్కడ ఏ కొంచెం అభ్యుదయ భావాలున్నా ఆహ్వానించారు. బ్రహ్మసమాజం, హితకారిణీ సమాజం వంటి సంస్కరణ దృక్పథం గల సంఘాల కార్యకలాపాలలో పాలు పంచుకొన్నారు. ‘దేశమాత’ అనే వారపత్రిక ద్వారా బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా వ్యాసాలు వ్రాశారు.

జీవితమంతా గ్రాంథికవాదిగానే గడిపారు. ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం వీరి “స్వీయచరిత్ర” ను ముద్రించి సమర్పిస్తూ చేసిన సన్మాన సభలో అరసం నాయకులు ఈ అంశంపై చిలకమర్తి వారి వైఖరిని వారితోనే సవినయంగా ఖండించారు (1944).

1943లో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆయనను ’కళాప్రపూర్ణ’ పురస్కారంతో సత్కరించింది.

రచనలు

పాఠశాలలో ఉన్నపుడే పద్యాలు వ్రాయడం ప్రారంభించిన లక్ష్మీ నరసింహం ఎన్నో రచనలు చేశారు. కీచక వధ ఆయన మొదటి నాటకం. తరువాత ద్రౌపదీ పరిణయం, గయోపాఖ్యానం, శ్రీరామ జననం, సీతా కళ్యాణం, పారిజాతాపహరణం వంటి నాటికలు రచించాడు. గయీపాఖ్యానం నాటకంలో టంగుటూరి ప్రకాశం పంతులు గారు అర్జునుడి వేషం వేసేవారు. ఆయన వ్రాసిన నవలలలో రామచంద్ర విజయం, హేమలత, అహల్యాబాయి, సుధా శరచ్చంద్రము ముఖ్యమైనవి. సరస్వతి పత్రిక సంపాదకునిగా ఉన్నపుడు సౌందర్య తిలక, పార్వతీ పరిణయం వ్రాశారు. ఇంకా అనేక రచనలు చేశారు.
1908లో ఒక ప్రెస్ స్థాపించారు. 1916 లో మనోరమ అనే పత్రిక స్థాపించారు. దీని ద్వారా గణపతి, రాజరత్నము, రఘుకుల చరిత్ర (కాళిదాసు రచన రఘువంశానికి అనువాదం), సిద్ధార్థ చరిత్ర వంటివి ప్రచురించారు. 21 అధ్యాయాలుగా ఆయన వెలువరించిన స్వీయ చరిత్రలో, ఆయన జీవిత కృషి మొత్తం వివరించబడింది.

ఆయన మొదటి నాటకం కీచక వధ 1889 జూన్ 15 రాత్రి ప్రదర్శింపబడింది. కలకత్తా బ్రహ్మసమాజం నాయకుడు పండిత శివానంద శాస్త్రి చిలకమర్తి వారిని ”లోకల్ షేక్స్‌పియర్” అని ప్రశంసించారు.

1894లో ఆయన వ్రాసిన రామచంద్రవిజయం అనే సాంఘిక నవల న్యాపతి సుబ్బారావు నిర్వహించిన పోటీలో మొదటి బహుమతి పొందింది. ఇది ఆయన ఆత్మకథ అంటారు. కొద్దికాలం ఆయన అష్టావధానాలు కూడా చేశారు.

1897 లో ఆయన వ్రాసిన ‘పృథ్వీరాజీయం’ అనే గేయ సంపుటి వ్రాతప్రతిని ఆయన మేనగోడలు రావూరి వెంకటసుబ్బమ్మ చించేసిందని, ఆ పుస్తకమంటే తనకెంతో ప్రీతియని, తన దృష్టిలో ఆ పుస్తకం మృతి చెందిన బంధువు వంటిదని చిలకమర్తి వారు తన స్వీయ చరిత్రలో వ్రాసుకున్నారు. మొత్తానికి ఆయన దానిని మళ్ళీ వ్రాసే ప్రయత్నం చెయ్యలేదు. అది అలా అముద్రితంగానే మిగిలిపోయింది.

మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికా నుండి రాకముందే చిలకమర్తి వారు హరిజనులకోసం ఒక పాఠశాలను ఆరంభించారు.
చిలకమర్తి గ్రహణ, ధారణ శక్తులు అమోఘం. వాసురాయకవి ఆయనది “ఫొటోజెనిక్ మెమరీ” అని వర్ణించారు. చిలకమర్తివారు మంచి వక్త కూడా. శ్రోతలను బాగా ఆకట్టుకొనేవారు. భారత జాతీయ కాంగ్రెసు కార్య కలాపాలలో ఆయన చురుకుగా పాల్గొనేవారు.

ఆయన రచన ’గణపతి’ నవల హాస్యరచనలలో ఎన్నదగినది. గణపతి నవల బహుళ ప్రచారం పొందింది. ఆకాశవాణిలో శ్రవ్యనాటికగా పలుమార్లు ప్రసారమైంది. చిలకమర్తి వారు ఆశువుగా చెప్పిన భరతఖండంబు చక్కని పాడియావు పద్యం స్వాతంత్ర్య సమరంలో ప్రముఖ స్థానం పొందింది. ఆత్మకథలోని పలుభాగాలు విద్యార్థులకు తెలుగువాచకంలో పాఠంగా కూడా నిర్దేశించారు.

ఇప్పటి పశ్చిమ గోదావరి జిల్లా ఖండవల్లిలో 26-9-1867 న పున్నయ్యగా జన్మించి ‘లక్ష్మీనరసింహం’ గా ప్రశస్తి పొంది 17-6-1946 న రాజమహేంద్రవరంలో మరణించారు. చిన్నతనంలో రేచీకటితో ఆరంభమైన కంటిచూపు సమస్య 1911 నాటికి పూర్తి గుడ్డిగా పరిణమించింది. వచ్చిన ఆటంకాలను అధిగమించి అనుకున్న లక్ష్యాలను సాధించిన ధైర్యశాలి. నాటకాన్ని ప్రజాస్వామ్యీకరించడంలోనూ, నవలల్లో తెలుగుదనం నింపడంలోనూ విలక్షణతను ప్రదర్శించిన, సమకాలీన సామాజిక పరిణామాల ఎగుడుదిగుడులను – సునిశిత పరిశీలకుడైన చరిత్రకారుడుగా తన రచనలలో చేర్చిన చిలకమర్తి లక్ష్మీనరసింహం తెలుగువాడి జోహార్లకు సదా పాత్రుడు.

– శ్రీరాంసాగర్

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.