
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రసంగించేందుకు ఈ నెలలో అమెరికాలో పర్యటించనున్నారు. ఈనెల 23 నుంచి 25 వరకు ఈ పర్యటన సాగనుంది. ఈ నెల 23 లేదా 24న అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో ప్రధాని మోదీ భేటీ కానున్నారు. ఈ నెల 25న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధాని పాల్గొని కరోనా, తీవ్రవాదంపై ప్రసంగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో అఫ్గానిస్థాన్‌పై భారత వైఖరిని వెల్లడించే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వంపై చర్చించనున్నారు. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితిలో తీసుకురావాల్సిన సంస్కరణలను ప్రస్తావించే అవకాశం ఉంది. మోదీ చివరిసారిగా 2019లో అమెరికాను సందర్శించారు. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో కలసి ప్రవాస భారతీయులు ఏర్పాటుచేసిన ‘హౌడీ మోదీ’ కార్యక్రమంలో ప్రసంగించారు.
వ్యాక్సినేషన్ పై ప్రధాని ఉన్నతస్థాయి సమావేశం
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. దేశంలో కరోనా పరిస్థితి, వ్యాక్సినేషన్‌పై చర్చించారు. కొవిడ్ మూడో దశ వస్తే.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకోవడమే గాక, వ్యాక్సినేషన్ వేగాన్ని పెంచాలని అధికారులకు ప్రధాని సూచించినట్టు తెలుస్తోంది. కేంద్ర ఆరోగ్య మంత్రి సహా కీలక అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. మరోవైపు.. దేశంలోని వయోజనులలో సగం మంది కనీసం ఒక్క డోసు టీకా తీసుకున్నారు. 18 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయి. మొత్తంగా 72 కోట్లకుపైగా టీకా డోసులు పంపిణీ చేశారు.





