
కరోనా మూడోదశ వ్యాప్తి భయాల నేపథ్యంలో కేరళలో ఒక్కసారిగా కోవిడ్ కేసులు విజృంభించాయి. ఆందోళన కలిగించే రీతిలో మరణాలు నమోదు అవుతున్నాయి. కేరళలో బుధవారం కరోనా సంక్రమణ తాలూకూ భయానక గణాంకాలు తెరపైకి వచ్చాయి. గత 24 గంటల్లో, ఇక్కడ 31,445 మందికి కరోనా సోకినట్లు వెల్లడైంది. కరోనా కారణంగా 24 గంటల్లో 215 మంది రోగులు మరణించారు. ఇక బుధవారం 20,271 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు, కేరళలో మొత్తం 38 లక్షల 83 వేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఇక్కడ ఇప్పటివరకూ మొత్తం 19 వేలకు పైగా ప్రజలు మరణించారు.
కరోనా మూడో దశ వ్యాప్తిపై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం..
భారతదేశంలో మూడో వేవ్ ప్రమాదంపై ఇప్పటికే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ఎటువంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధపడాలని కోరింది. అక్టోబర్ నాటికి కరోనా మూడో వేవ్ ఉధృతి ఉండవచ్చని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనా వేస్తోంది. ప్రస్తుతం కేరళ కరోనా కేసుల నమోదు మూడో వేవ్ సంకేతంలా కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు. ఈ పరిస్థితి చూస్తుంటే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంచనాలు నిజమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.





