
నెల్లూరు నగరంలోని జి వి ఆర్ ఆర్ జూనియర్ కళాశాలలో ఆరోగ్య రక్షా సమితి ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు జరిగాయి. ఈ కార్యక్రమంలో సమితి అధ్యక్షులు డాక్టర్ సి వి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఈ కరోనా 3rd వేవ్ నుంచి తమను తాము కాపాడుకోవడానికి ప్రజలు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు. ఒకవేళ కరోనా వస్తే ఎలాంటి చికిత్స, జాగ్రత్తలు తీసుకోవాలో కూడా ఆయన వివరించారు.
మరొక వైద్యులు డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ కోవిడ్ వస్తే తీసుకోవలసిన చికిత్స, జాగ్రత్తలను వివరిస్తూ అవసరమైనవారికి ఆక్సిజన్ ఎలా పెట్టాలి? ఆక్సిజన్ కాన్సెంట్రేటర్ ను ఎలా వాడాలి? అనే విషయాలను కూడా వివరించారు. పల్స్ ఆక్సీ మీటర్, థర్మల్ మీటర్ మొదలైన వైద్య పరికరాలను వాడే విధానాన్ని కూడా వారు వివరించారు.

ఈ కార్యక్రమానికి ప్రముఖ ఆడిటర్ శ్రీ చలపతి ముఖ్య అతిథిగా విచ్చేశారు. జిల్లా నలుమూలల నుండి సుమారు 80 మంది ఈ కార్యక్రమంలో పాల్గొని శిక్షణ పొందారు.
సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు జిల్లాలోని ప్రతి గ్రామంలో “జన జాగరణ ఉద్యమం” చేపట్టనున్నామని, ప్రజలకు కరోనా 3rd వేవ్ తో పొంచి ఉన్న ప్రమాదాన్ని వివరించి, అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వస్తే తీసుకోవాల్సిన చికిత్స, జాగ్రత్తల గురించి గ్రామ గ్రామానా వివరించనున్నామని, ఆ మేరకు ఇంటింటికీ పూర్తి వివరాలతో కూడిన ఓ కరపత్రాన్ని కూడా అందించనున్నామని ఆరోగ్య రక్షా సమితి నెల్లూరు జిల్లా కన్వీనర్ శ్రీ ముక్కాల వ్యాస ప్రసాద్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సమితి కో కన్వీనర్ శ్రీ బొందల మల్లిఖార్జున్ రెడ్డి మరియు ఇతర పెద్దలు పాల్గొన్నారు.





