News

ఆఫ్ఘన్ అంశంపై అంతర్జాతీయ వేదికపై చర్చ.. భారత్ కు అందని ఆహ్వానం

424views

ఫ్గానిస్థాన్‌ పరిణామాలపై ఈ నెల 11న రష్యా నిర్వహించతలపెట్టిన కీలక సమావేశానికి భారత్‌కు ఆహ్వానం అందలేదు. ‘ఎక్స్‌టెండెడ్‌ ట్రొయికా’ పేరుతో ఖత్తార్‌లో నిర్వహించే ఈ భేటీలో పాకిస్థాన్‌, చైనా, అమెరికా పాల్గొంటాయని సంబంధిత వర్గాలు గురువారం వెల్లడించాయి. అఫ్గాన్‌లో తాలిబన్ల దాడులు పెరిగిపోతున్న తరుణంలో శాంతియుత వాతావారణాన్ని ఏర్పరిచేందుకు రష్యా ప్రయత్నాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా అఫ్గాన్‌తో సంబంధాలున్న అన్ని భాగస్వామ్య దేశాల సాయం తీసుకోబోతున్నట్లు ప్రకటించింది.

అఫ్గాన్‌లో శాంతి పరిరక్షణ కోసం భారత్‌ కూడా కృషి చేస్తోంది. యుద్ధంతో నష్టపోయిన ఆ దేశంలో పునర్నిర్మాణం, సహాయక కార్యక్రమాల కోసం సుమారు 300 కోట్ల డాలర్లు వెచ్చించింది. అఫ్గాన్‌లో పరిస్థితిని చక్కదిద్దే దిశగా ప్రభావం చూపగల దేశాలన్నింటితోనూ కలసి పనిచేస్తామని, భారత్‌ కూడా అందులో ఉందని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ గత నెలలో చెప్పారు. దీంతో తదుపరి సమావేశంలో భారత్‌ భాగస్వామ్యం కూడా ఉంటుందని భావించారు. కానీ రష్యా ఆ దిశగా నిర్ణయం తీసుకోలేదు. తాలిబన్లకు సహకారం అందిస్తున్న పాక్‌కు ఈ సమావేశాల్లో స్థానం కల్పించడంపై రష్యా వద్ద భారత్‌ అభ్యంతరం వ్యక్తం చేసిందని, అందుకే రష్యా.. భారత్‌కు ఆహ్వానం పంపలేదని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. దీనిపై భారత్‌ ఇప్పటివరకూ స్పందించలేదు. మరోవైపు శుక్రవారం భారత్‌ అధ్యక్షతన నిర్వహించే ఐరాస భద్రత మండలి సమావేశంలో అఫ్గాన్‌ పరిస్థితిపై చర్చించనున్నట్లు ఐరాసలోని భారత రాయబారి టీఎస్‌ తిరుమూర్తి తెలిపారు.

అఫ్గాన్‌లో జరుగుతున్న ఘర్షణల కారణంగా ఇప్పటివరకూ సుమారు 3.60 లక్షల మంది నిరాశ్రయులు కావడంపై ఐరాస అధినేత ఆంటోనియో గుటెరస్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఈ హింసకు ముగింపు పలకాలని పేర్కొన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.