News

గుజ‌రాత్ : అన్యమతం నుండి అమ్మఒడిలోకొచ్చిన 21 కుటుంబాలు

577views

గుజ‌రాత్ రాష్ట్రంలోని వాపి ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ఘ‌ర్‌వాప‌సి కార్యక్రమంలో ధరంపూర్, కప్రాడా జిల్లాల‌కు చెందిన 21 కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు.

‘దేశ్ గుజరాత్’ కథనం ప్రకారం… ఈ కుటుంబాలు గ‌తంలో క్రైస్తవ మతం పట్ల ఆకర్షితులై ఆ మతాన్ని స్వీకరించారు. తిరిగి త‌మ స్వ‌ధ‌ర్మంలోకి రావాల‌ని నిశ్చ‌యించుకుని వాపిలో బాపా సీతారాం ఆశ్రమం నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఘ‌ర్‌వాప‌సి కార్యక్రమంలో తమ మాతృధర్మంలోకి తిరిగి వచ్చారు.

ఈ సందర్భంగా స్థానిక బిజెపి ఎమ్మెల్యే కనుభాయ్ దేశాయ్ మాట్లాడుతూ, ”విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన హిందూ జాగ‌ర‌ణ్ మంచ్ కార్యక్రమంలో హిందూ మ‌తానికి సంబంధిన అనేక స‌మ‌స్య‌లు, వాటిని అధిగ‌మించేందుకు ప‌రిష్కార మార్గాల‌ను చ‌ర్చించిన‌ట్టు తెలిపారు. అదే విధంగా రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌ల‌వంత‌పు మ‌త మార్పిడి నిరోధక చ‌ట్టంపై ప్ర‌జ‌ల‌కు అవగాహన కల్పించిన‌ట్టు ఆయ‌న తెలిపారు.

ఈ సంద‌ర్భంగా హిందూ మ‌తంలోకి తిరిగి వ‌చ్చిన ఒక వ్య‌క్తి మాట్లాడుతూ… ”గ‌తంలో మాకున్న ఇబ్బందుల‌ను ఆసరాగా చేసుకుని క్రైస్త‌వ మ‌త సంస్థ‌ల వారు మా స‌మ‌స్య‌ల‌ను పరిష్క‌రిస్తామ‌ని మాయ‌మాట‌లు చెప్పి మ‌మ్మ‌ల్ని మ‌తం మార్చారు. మేము మ‌తం మారి 5సంవ‌త్స‌రాలు అవుతున్నా మా ఇబ్బందులు ఏమీ త‌గ్గ‌లేదు. ఆ మ‌త‌సంస్థ‌ల ప‌ట్ల స‌రైన అవ‌గాహ‌న లేక స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయ‌నే ఆశ‌తో గ‌తంలో మేము మ‌తం మారాం. కానీ వాస్త‌వాల‌ను గ్ర‌హించి, ఇప్పుడు తిరిగి హిందూ మ‌తంలోకి వ‌చ్చాము” అని అన్నాడు.

యూపీ: తిరిగి హిందూ మతంలోకి వ‌చ్చిన‌ ముగ్గ‌రు యువ‌కులు

హిందూ జాగ‌ర‌ణ్ మంచ్ నిర్వ‌హించిన ఘర్ వాప‌సీ కార్య‌క్ర‌మంలో యూపీకి చెందిన ముగ్గ‌రు యువ‌కులు తిరిగి హిందూ మ‌తాన్ని స్వీక‌రించారు.

ఈ సంద‌ర్భంగా రోషన్ లాల్ హిందూ మతంలోకి తిరిగి వ‌చ్చిన త‌ర్వాత కన్నీరుమున్నీరయ్యాడు. అతను ఎలా, ఎందుకు మతం మార్చుకోవాల్సివ‌చ్చిందో వెల్లడించాడు. అతన్ని కొంత మంది వ్య‌క్తులు మత్తుపదార్థాలకు బానిస చేసి ఆ త‌ర్వాత బ‌ల‌వంతంగా మత మార్పిడి చేశార‌ని, ఆ త‌ర్వాత ఆ వ్యక్తులు అతనిని బెదిరించి అత‌ని వ‌ద్ద ఉన్న ఆస్తిని కూడా స్వాధీనం చేసుకున్నారని అతను తెలిపాడు.

ఔష‌ద మూలిక‌ల దుకాణం నిర్వహించే అరవింద్ అనే వ్య‌క్తి వ‌ద్ద‌కు ఖలీద్, నదీమ్ తరచూ వచ్చేవారు. ఈ క్ర‌మంలో అతను మ‌తం మారితే రూ .10 లక్షలు ఇస్తామని, అలాగే అందమైన అమ్మాయితో వివాహం చేయిస్తామ‌ని న‌మ్మించారు. అరవింద్ వాళ్లు చెప్పిన‌ట్టుగా మతం మారాడు. కానీ వాళ్ళు అతనికి రూ.10 ల‌క్ష‌లు ఇవ్వలేదు సరికదా అతనికి వివాహం కూడా జ‌ర‌గ‌లేదు. అమిత్ అనే మ‌రోక వ్య‌క్తి 2014లో బ‌ల‌వంతంగా ఇస్లాం మతంలోకి మారి అబ్దుల్ గా పేరు మార్చుకున్నాడు. ఆయ‌న తిరిగి హిందూ మతంలోకి వ‌చ్చిన‌ప్పుడు అత‌ని కుటుంబ స‌భ్యులు సంతోషం వ్య‌క్తం చేశారు.

బలవంతంగా మ‌త మార్పిళ్ల‌కు గురైన కుటుంబాల‌ను, వ్య‌క్తుల‌ను తిరిగి హిందూ మ‌తంలోకి తీసుకురావ‌డానికి విశ్వ హిందూ పరిషత్ దేశ వ్యాప్తంగా కృషి చేస్తోంది.

Source : OPINDIA & VSK TELANGANA

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.