
ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా దళాలు వెనక్కి వెళ్లిపోవడం ప్రారంభించిన తరువాత స్థానిక ప్రభుత్వానికి, తాలిబన్లకు మధ్య ఘర్షణ తీవ్రరూపం దాల్చింది. దేశంలోని 85 శాతం భూభాగాన్ని తాము స్వాధీనం చేసుకున్నామని తాలిబన్లు ఇటీవల ప్రకటించారు. ఆఫ్ఘన్ ప్రభుత్వం ఆ మాటను తోసిపుచ్చుతోంది.
అయితే, మొత్తం 400 జిల్లాల్లో మూడో వంతు మీద తాలిబన్లు పట్టు సాధించారనే అంచనాలు వినిపిస్తున్నాయి. తమ ఖైదీలను విడుదల చేయడమే కాకుండా ఐక్యరాజ్యసమితి బ్లాక్ లిస్ట్ నుంచి వారి పేర్లు తొలగించాలని కూడా తాలిబన్లు డిమాండ్ చేస్తున్నారు.
గత ఏడాది 5,000 మంది తాలిబన్లను విడుదల చేశారు. వారిలో చాలా మంది మళ్లీ యుద్ధంలో చేరారని, ఫలితంగా హింస మరింత పెరిగిందని అంతర్జాతీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.తాలిబన్లు ఇప్పటికే అనేక ప్రావిన్సుల రాజధానులను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. వారు ఇప్పటి వరకు ముట్టడించిన నగరాలు ఎక్కువగా ఉత్తర ప్రావిన్స్‌లో ఉన్నాయి. ఇవి అఫ్గానిస్తాన్‌కు, మధ్య ఆసియా దేశాలకు సరిహద్దులలో ఉన్నాయి.
గత వారం నుంచి దక్షిణ, తూర్పు ప్రాంతాలపై కూడా తాలిబన్లు గురి పెట్టారు. దీంతో దేశ రాజధాని కాబూల్ సహా సమీపంలోని ఉన్న ప్రాంతాలకు ప్రమాదం కనిపిస్తోంది.





