
భారతీయ భాషల్లో సాంకేతిక విద్య బోధించాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ప్రపంచస్థాయి ప్రఖ్యాత జర్నల్స్‌ను మన భాషల్లోకి అనువదించాల్సి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల డైరెక్టర్లతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. సాంకేతిక విద్యను సామాన్యులకు చేరువ చేసేందుకు కొత్త విధానాలను రూపొందించాలని ఆయన కోరారు.
పర్యావరణ మార్పులు, కొత్త సవాళ్లను దృష్టిలో ఉంచుకొని ఉన్నత సాంకేతిక విద్యలో మార్పులు, చేర్పులు చేయాల్సిన అవసరముందని. ఇందుకు సంస్థలు తయారై.. పరిస్థితులను మూల్యాంకనం చేసుకోవాలన్నారు. అందరికీ సమాన స్థాయిలో నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా చూడటమే విద్యావిధానం మూలసూత్రం కావాలని పేర్కొన్నారు. కొన్నేళ్లుగా ఉన్నత విద్యారంగంలో నమోదవుతున్న వారి సంఖ్య మెరుగుపడటం అభినందనీయమని.. ఉన్నత విద్యను డిజిటలీకరిస్తే ఈ నిష్పత్తి మరింత పెరుగుతుందని సూచించారు.





