News

కొత్త ఐటీ నిబంధనలకు అనుగుణంగా అధికారి నియామకం… అంతలోనే రాజీనామా… స్పందించని ట్విట్టర్

403views

ట్విట్టర్ వరుస వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది. భారత్ తెచ్చిన కొత్త ఐటి చట్టాలకు అనుగుణంగా నియమితులైన తాత్కాలిక రెసిడెంట్‌ గ్రీవెన్స్‌ అధికారి ధర్మేంద్ర చాతుర్‌ ఆ పదవి నుంచి వైదొలిగారు. అందుకు గల కారణాలు తెలియరాలేదు. దీనిపై స్పందించేందుకు ట్విట్టర్ నిరాకరించింది. భారత ప్రభుత్వానికి, ట్విట్టర్కు మధ్య వివాదం నెలకొన్న వేళ ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.

50 లక్షల యూజర్లున్న సోషల్‌మీడియా సంస్థలు భారత్‌కు చెందిన ముగ్గురు అధికారులను నియమించుకోవాలి.. వారి వివరాలను పొందుపరచాలని నూతన ఐటీ నిబంధనలు చెబుతున్నాయి. ఆ మేరకు మిగిలిన సోషల్‌మీడియా కంపెనీలు గ్రీవెన్స్‌ అధికారులతో పాటు ఇతర అధికారులను నియమించుకున్నాయి. ట్విట్టర్ మాత్రం ఈ విషయంలో ఆలస్యం చేసింది. కేంద్ర ప్రభుత్వం చివరి నోటీసుకు స్పందిస్తూ చీఫ్‌ కాంప్లియన్స్‌ అధికారిని నియమిస్తామని, అదే సమయంలో చాతుర్‌ను తాత్కాలిక గ్రీవెన్స్‌ అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపింది. కొద్దిరోజులకే ఆయన వైదొలగడంతో గ్రీవెన్స్‌ అధికారి స్థానంలో ఆయన పేరును తొలగించింది. ప్రస్తుతం అమెరికా అడ్రస్‌, ఈ-మెయిల్‌ ఐడీతో కూడి మరొకరి పేరు చూపుతోంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.