యావత్ ప్రపంచానికి సవాల్ విసురుతోన్న కరోనా వైరస్ మహమ్మారిని ఎదుర్కొనేందుకు భారతీయ శాస్త్రవేత్తల సిద్ధాంతాలు, వినూత్న ఆలోచనలతో చేస్తోన్న ప్రయత్నాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కొనియాడారు. ముఖ్యంగా ఏడాదిలోపే స్వదేశీ (Made in India) టీకాను అభివృద్ధి చేయడం పట్ల భారత శాస్త్రవేత్తలను ప్రశంసించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) సొసైటీ ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడిన మోడీ, కేవలం ఏడాదిలోపే వ్యాక్సిన్ తీసుకురావడం వల్ల మహమ్మారిపై పోరులో మానవాళి విజయానికి శాస్త్రవేత్తలు దోహదపడ్డారని అన్నారు.
‘నూతన ఆవిష్కరణలతో విదేశాలు సాధించిన ఫలితాలను అందిపుచ్చుకోవడానికి భారత్ కొన్నేళ్లపాటు వేచి చూసేది. కానీ, అదే వేగంతో మన శాస్త్రవేత్తలు కూడా వినూత్న ఆలోచనలతో ప్రయోగాల్లో దూసుకెళ్తున్నారు. విదేశీ శాస్త్రవేత్తలతో భారతీయ నిపుణులు కలిసి పనిచేస్తూ యావత్ మానవాళికి సహాయపడుతున్నారు’ అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. కరోనా వైరస్ వల్ల ఏర్పడిన ఆరోగ్య సంక్షోభం యావత్ ప్రపంచానికి సవాల్ విసిరిందన్నారు. ఇలాంటి సవాళ్లు ఎదురైన ప్రతిసారీ వాటినుంచి మానవాళిని రక్షించేందుకు శాస్త్రవిజ్ఞానం దోహదం చేసిన ఘటనలు చరిత్రలో ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు.
“శాస్త్రవేత్తల మదిలో మెదిలే ఆలోచనలను తొలుత సిద్ధాంత రూపంలో ఉంచి ప్రయోగశాలల్లో ప్రాక్టికల్స్ నిర్వహిస్తారు. వాటిని అమలు చేసి, ఫలితాలను విశ్లేషించిన అనంతరం బాహ్యప్రపంచానికి అందిస్తారు, వీటన్నింటిని కేవలం ఏడాదిన్నర కాలంలోనే మన శాస్త్రవేత్తలు అత్యంత వేగంతో పూర్తి చేయడం నిజంగా అద్భుత”మని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఇలా వ్యవసాయం నుంచి ఖగోళశాస్త్రం, విపత్తు నిర్వహణ నుంచి రక్షణ సాంకేతికత, వ్యాక్సిన్లను అభివృద్ధి చేయడం వరకు అన్ని రంగాల్లో భారత్ స్వావలంబన దిశగా అడుగులు వేస్తోందన్నారు. ఇవే కాకుండా సుస్థిరాభివృద్ధితో పాటు క్లీన్ ఎనర్జీలోనూ భారత్ ప్రపంచ దేశాలకు మార్గనిర్దేశనం చేస్తోందని ప్రధాని మోడీ పునరుద్ఘాటించారు.