
రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల వద్ద 1.93 కోట్లకుపైగా కరోనా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని శుక్రవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు 24 కోట్లకు పైగా డోసులను కేంద్రం పంపిణీ చేసిందని తెలిపింది. వాటిలో కొన్ని ఉచితంగా అందించినవి, మరికొన్ని నేరుగా రాష్ట్రాలు సేకరించినవి ఉన్నాయని పేర్కొంది.
మొత్తం 24 కోట్లకు పైగా డోసుల్లో 22,27,33,963 డోసులను రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు వినియోగించాయని ఆరోగ్య శాఖ వెల్లడించింది. వృథా అయిన డోసులు కూడా ఆ లెక్కలోనే ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రాల వద్ద 1,93,95,287 డోసులు అందుబాటులో ఉన్నాయని చెప్పింది. ఇక, దేశవ్యాప్తంగా నిర్వహిస్తోన్న కరోనా టీకా కార్యక్రమం కింద కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అందిస్తోంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వి టీకాకు అత్యవసర వినియోగం కింద అనుమతి లభించగా, మరికొన్ని కొత్త టీకాలను అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ప్రయత్నాలు చేస్తోంది.