News

బెంగాల్ : గవర్నర్ బంగ్లా ముందు TMC శ్రేణుల వికృత చేష్టలు – పోలీసుల ప్రేక్షకపాత్ర

1kviews

పశ్చిమ బెంగాల్‌లో గవర్నర్‌ కార్యాలయం, ముఖ్యమంత్రి కార్యాలయం మధ్య వివాదం ముదురుతోంది. ఇద్దరు మంత్రులతో సహా మరో ఇద్దరు తృణమూల్‌ నేతలు అరెస్ట్‌ కావడం, రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ ప్రయత్నిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ ఆరోపించడం తృణమూల్‌ నేతల్లో ఆగ్రహానికి కారణమయ్యింది. దీంతో గవర్నర్‌ కార్యాలయం ముందు వరుసగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గొర్రెల మందతో కొందరు నిరసన చేపట్టడంపై రాష్ట్ర గవర్నర్‌ తీవ్రంగా స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా రాజ్‌భవన్‌ వద్ద శాంతిభద్రతలు క్షీణించిపోయాయని ఆయన పేర్కొన్నారు. అల్లరి మూకల ఆగడాలను నిరోధించడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని గవర్నర్‌ ఆరోపించారు.

‘రాష్ట్రంలో శాంతి భద్రతలే కాదు, రాజ్‌భవన్‌ ప్రవేశ ద్వారం వద్ద జరుగుతున్న ఘటనలు ఆందోళనకరంగా ఉన్నాయి. నిషేధాజ్ఞలు అమలులో ఉన్న ప్రాంతంలో నిరసన కార్యక్రమాలను అనుమతించడమేమిటి? పోలీసుల తీరు బాధాకరం. కట్టుదిట్టమైన భద్రత ఉండే రాజ్‌భవన్‌ ముందు కొన్ని రోజులుగా వరుసగా జరుగుతున్న వికృత చేష్ఠలు ఆందోళకరం’ అని గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అంతేకాకుండా భారీ సంఖ్యలో పోలీసులు ఉన్నప్పటికీ వీటిని అడ్డుకోకుండా చూస్తూ ఊరుకోవడంతో పాటు రాజ్‌భవన్‌ శాంతి భద్రతల విషయంలోనూ పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఈ పరిణామాలపై వెంటనే వివరణ ఇవ్వాలని కోల్‌కతా పోలీస్‌ కమిషనర్‌ను గవర్నర్‌ ఆదేశించారు.

ఇదిలాఉంటే, నారదా కుంభకోణం కేసులో ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే సహా మాజీ మంత్రిని సీబీఐ అరెస్టు చేసింది. వీరిపై విచారణ జరిపేందుకు గవర్నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో తృణమూల్‌ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇందులో భాగంగా రెండు రోజులుగా రాజ్‌భవన్‌ ముందు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో పలుచోట్ల హింస చోటుచేసుకున్న విషయం తెలిసిందే. కాగా గవర్నర్ బంగ్లా ముందు కూడా అల్లరిమూకలు రెచ్చి పోతూ ఉండడం…. అక్కడ నెలకొన్న దారుణ పరిస్థితులకు అద్దం పడుతోంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.