ArticlesNews

విశాఖలో నిశ్శబ్దంగా ఉచిత కోవిడ్ కేర్ సెంటర్ నడుపుతున్న ఆర్ ఎస్ ఎస్

736views

విశాఖపట్నం నగర శివార్లలోని గుడిలోవలో నిన్నమొన్నటిదాకా కొన్నివేల మంది విధ్యార్ధులకు సంస్కారంతోకూడిన విద్యను అందించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కి చెందిన విజ్ఞాన్ విహార్ స్కూలు, ప్రస్తుతం కోవిడ్ కేర్ సెంటర్ గా మారిపోయింది.

అంతేనా, ఈ 100 పడకల కోవిడ్ సెంటర్లో పూర్తి ఉచితంగా వైద్యసేవలు అందిస్తున్నారు. మానవ సేవే మాధవ సేవ అని నమ్మే ఆర్ ఎస్ ఎస్ సేవకులు ఇక్కడి కోవిడ్ పేషెంట్లకు వివిధరకాలుగా సేవలందిస్తున్నారు.

ఉచిత వైద్యం, పూర్తి ఉచితంగానే బెడ్, మందులూ, ఆరోగ్యకరమైన మరియూ బలవర్ధకమైన ఆహారంతో పాటు, మామూలుగా కార్పొరేట్ ఆసుపత్రులలో కూడా దొరకని ఇతర సేవలు కూడా ఇక్కడ లభ్యం అవుతున్నాయి. ప్రతిరోజూ పేషెంట్లతో యోగాసనాలు వేయించటం, ప్రాణాయామం చేయించటం మరియూ వైద్యులతో కౌన్సెలింగ్ ఇప్పించటం ఇక్కడి ప్రత్యేకతలు. ఇక్కడ స్త్రీ పురుషులను వేరు వేరు వార్డులలో ఉంచుతారు.

చుట్టూ కొండలతో, మామిడి వృక్షాల తోటలో అహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న ఈ కోవిడ్ కేర్ సెంటర్ విశాఖలో ఎంతోమంది కోవిడ్ పేషెంట్లకు ఆర్ ఎస్ ఎస్ ఇచ్చిన గొప్ప వరం.

అత్యవసర సేవల కోసం వీరికి ఇక్కడ రెండు అంబులెన్సులు కూడా ఉన్నాయి. ఐతే, ఈ సెంటర్లో ఆక్సిజన్ సర్వీసు అందుబాటులో లేకపోవటంతో, 50 సంవత్సరాల లోపు వయస్సున్న ఊపిరి సమస్యలు లేని కోవిడ్ పేషంట్లను మాత్రమే తీసుకుంటారు. కనుక, కోవిడ్ లక్షణాలు కనిపించి, ఇంకా పరిస్థితి సీరియస్ అవ్వని పేషెంట్లూ, కోవిడ్ పాజిటివ్ వచ్చిన తరువాత ఇతర కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ కోవిడ్ నుంచి కోలుకోవాలనుకునే పేషెంట్లకూ ఆర్ ఎస్ ఎస్ చే నిర్వహించబడుతున్న ఈ కోవిడ్ కేర్ సెంటర్ గొప్ప అవకాశమనే చెప్పాలి.

ఈ ఉచిత కోవిడ్ కేర్ సెంటర్ ను ఎలాంటి గుర్తింపూ, పేరు ప్రతిష్టలూ ఆశించని కొంతమంది స్వయం సేవకులు చక్కగా నడుపుతున్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.