ArticlesNews

వ్యాక్సిన్ వృధాకి బాధ్యులెవరు?

738views

రోనా మహమ్మారితో ప్రపంచం అట్టుడిగిపోతున్న వేళ మిగతా ప్రపంచం కంటే ముందుగా మన దేశంలోని శాస్త్రవేత్తలు కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్నారు. మనదేశంలో వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వచ్చేటప్పటికీ అమెరికా మోడెర్నాకానీ, రష్యన్ ఫైజర్, స్ఫుత్నిక్ లు గానీ, జాన్సన్ అండ్ జాన్సన్ వారి వ్యాక్సిన్ కానీ ఏవీ అంతగా అందుబాటులోకి రాలేదు.

నిజానికి మన శాస్త్రవేత్తలు సాధించింది సామాన్యమైన ఘనతేమీ కాదు. ఎంతో ప్రతిష్టాత్మకమైన, దేశం గర్వించ వలసిన ఆవిష్కరణ అది. కానీ మన మీడియా దానిని చాలా సాధారణ విషయంగా పరిగణించింది. చాలా సాధారణ వార్తగానూ అంతకంటే సాదాసీదాగానూ ఆ ఆవిష్కరణను ప్రజల ముందు ఉంచింది. అంతటితో ఆగిందా? వాటిపై ప్రజలలో లేనిపోని అపోహలు సృష్టించే ప్రయత్నం యథాశక్తి చేసింది. సరే ఎట్టకేలకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చింది. 80 కి పైగా దేశాలకు భారత్ వ్యాక్సిన్ ను సరఫరా చేసింది. ఆయా దేశాల ఆనందానికి అవధులు లేవు. బ్రెజిల్ ప్రధాని అయితే “హనుమంతుడు సంజీవని తెచ్చినట్టుగా భారత్ మా దేశానికి వ్యాక్సిన్ తెచ్చింది” అని ప్రశంసించారు. దీనిని కూడా మన మీడియా అత్యంత సాధారణ విషయంగానే పరిగణించింది.

ముందుగా ఫ్రంట్ వారియర్స్ కి అందరికీ వ్యాక్సిన్ లు వేయడం జరిగింది. ఆ దశలోనే కొంతమంది సోషల్ మీడియా ద్వారానూ, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారానూ వ్యాక్సిన్ పై శక్తివంచన లేకుండా దుష్ప్రచారానికి దిగారు. ఎక్కడో ఏదో భయంతోనో, మరే ఇతర కారణాల వల్లనో కళ్లు తిరిగి పడిపోవడం, చెమటలు పట్టడం వంటి చిన్న చిన్న సంఘటనలను సైతం గోరంతలు కొండంతలు చేసి వ్రాయడం మొదలు పెట్టారు. కోవ్యాక్సిన్, కోవీషీల్డ్ ల గురించి తగినంత ప్రచారం చెయ్యలేదు.

దాంతో సహజంగానే ప్రజలకు టీకాపై లేనిపోని భయాలు పట్టుకున్నాయి. 60 సంవత్సరాలు పైబడిన వారికి వ్యాక్సిన్ వేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించి అందుకు అవసరమైన వ్యాక్సిన్ నిల్వలను ఆయా రాష్ట్రాలకు చేరవేసింది. కానీ అప్పటికే ప్రజలలో నెలకొన్న భయాల వల్ల ఎవరూ పెద్దగా టీకా వేయించుకోవడానికి ముందుకు రాలేదు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అది తమ పని కాదన్నట్టుగా వ్యవహరించాయి. అయిన దానికీ కాని దానికీ నానా యాగీ చేసే మీడియా కూడా టీకా వ్యవహారంలో మిన్నకుండి పోయింది. ప్రజలలో అవగాహన పెంచేందుకు కించిత్ ప్రయత్నం కూడా చెయ్యలేదు.

ఒక వ్యాక్సిన్ పది డోసులు, అంటే పది మందికి వస్తుంది. సీసా మూత తెరిస్తే, ఆరోజు కనీసం పదిమందికి వ్యాక్సిన్ వేస్తేనే అది పూర్తిగా వినియోగించినట్లు అవుతుంది. లేకపోతే మిగిలిన వ్యాక్సిన్ను ఆ రోజుకు వృధాగా పడేయాల్సిందే. అలా అనేక ఆసుపత్రుల్లో ఒక్క రోజులో పదిమంది కూడా వ్యాక్సిన్ వేసుకోక వృధాగా పడేసిన సందర్భాలు ఎన్నో. ఆ విధంగా కేంద్రం రాష్ట్రాలకు పంపిన వ్యాక్సిన్లలో 23 శాతం అంటే అక్షరాలా 44 లక్షల డోసుల వ్యాక్సిన్ వృధాగా పోయిందట. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా?

“వ్యాక్సిన్లు వచ్చి ఉన్నవి, వేసుకోండి” అని ప్రజలకు సరిగా వినతి చేయని ప్రభుత్వాలు, ప్రజలలో అవగాహన కల్పించి అపోహలు తొలగించే ప్రయత్నం చెయ్యని మీడియా ఇప్పుడు….. కరోనా కేసులు వెల్లువెత్తుతున్న వేళ….. వ్యాక్సిన్ల కొరత ఏర్పడిపోయిందంటూ గగ్గోలు మొదలుపెట్టాయి. “వ్యాక్సిన్లకు ఏమీ కొరత లేదు. ఉన్నవి సమర్థంగా వాడుకోండి. మేము వెంటవెంటనే సరఫరా చేస్తాం.” అని కేంద్ర ప్రభుత్వం ఎంతగా మొత్తుకున్నా రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయా రాజకీయ పార్టీల అనుకూల మీడియా టీకాల కొరతపై కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టడం మాత్రం మానలేదు. టీకాపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన, అందరికీ సక్రమంగా అందేలా చూడాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకి, మీడియాకి లేదా? ఎంతో విలువైన టీకా వృధా కావడానికి వారు కారణం కాదా?

ఈలోగా కొన్ని వర్గాల నుంచి “రష్యా, అమెరికాల వ్యాక్సిన్లను భారత్లోకి అనుమతించాలి. అప్పుడుగానీ ఈ కొరత తీరదు.” అని కేంద్ర ప్రభుత్వానికి వినతులు వెల్లువెత్తాయి. దాంతో కేంద్రం కూడా ఎందుకొచ్చిన గొడవ అనుకుందో ఏమో? రష్యా వ్యాక్సిన్ స్ఫుత్నిక్ కి అనుమతి ఇచ్చింది. ఆ ప్రక్రియ నడుస్తోంది. దాంతో ఇక మీడియా ఆనందానికి అవధులు లేకుండా పోయినట్లయింది.

భారత వ్యాక్సిన్ ల గురించి ఏనాడూ తగినంతగా వ్రాయని పత్రికలు “ఆహా ఓహో……. అదిగదిగో రష్యా వ్యాక్సిన్, ఇదిగిదిగో రష్యా వ్యాక్సిన్, వచ్చేసిందొచ్చేసిందొచ్చేసింది……. “ అంటూ మూడు రోజుల నుంచి తెగ సంబరపడిపోతున్నాయ్. “ఏంటో మీడియాకింత ఉత్సాహం? రష్యా నుంచి మీడియాకెంత ముట్టిందో?” అని మీడియా వ్యవహారాలలో అనుభవం ఉన్న కొంతమంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు.

వీడియో గేమ్ అయినా, కంప్యూటర్ అయినా, స్మార్ట్ ఫోన్ అయినా, ఏదైనా మెడిసిన్ అయినా, చివరికి టీకా అయినా అది రష్యా అయినా, అమెరికా అయినా, చైనా అయినా వాటికి అతి పెద్ద మార్కెట్ భారత్. తమ ఉత్పత్తులను భారత్ ప్రజలకు అమ్మ గలిగితే అత్యధిక లాభాలు ఆర్జించవచ్చునన్నది ఆయా దేశాల ప్రభుత్వాలకి, పారిశ్రామిక సంస్థలకు ఉన్న స్పష్టమైన అవగాహన. అందుకే ఏదైనా కొత్త ఉత్పత్తి మార్కెట్లోకి వచ్చింది అంటే….. వారి మొదటి చూపు భారత్ పైనే ఉంటుంది. ఇప్పుడు టీకా విషయంలోనైనా అంతే. కానీ ఇప్పుడు భారత్ మారిపోయి ఉంది. గతంలోలా కాదు. భారత్లోనే ఒకటికి రెండు వ్యాక్సిన్లు తయారైపోయాయి. ఇంకా కొన్ని పరీక్షల దశలో ఉన్నాయ్. భారత్లో ప్రజలకు ఇవ్వడమే కాకుండా ప్రపంచంలోని 80 పైగా దేశాలకు భారత్ వ్యాక్సిన్ సప్లయర్ గా మారింది. మరి భారత్ తో వ్యాపారం చేయాలనుకున్న వారికి ఇది కాస్త ఇబ్బంది కలిగించే విషయమే కదా? వ్యాక్సిన్ లను అధిక ధరలకు అమ్ముకుని సొమ్ము చేసుకునే అవకాశం లేకుండా చేసిన కేంద్ర ప్రభుత్వంపై భారత్ లోని మెడికల్ మాఫియా  ఇప్పటికే గుర్రుగా ఉంది. మరి ఇప్పుడు రష్యన్ వ్యాక్సిన్ను అర్జంటుగా భారత్లోకి అనుమతించాలని కేంద్రానికి వినతులు సమర్పించుకున్న వారికి, రష్యన్ వ్యాక్సిన్ రాకపై చంకలు గుద్దుకుంటూ మురిసిపోతున్న మీడియా సంస్థల అత్యుత్సాహానికి ఏమిటి కారణం? “వారి లెక్కలు వారికుంటాయి కదా?” అంటారా?

– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.