దేశ రక్షణ విషయాలపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సూచనలు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక సూచన చేశారు. అమెరికాను ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి సురక్షితంగా కాపాడేందుకు పలు దేశాలపై ప్రయాణ నిషేధ ఆంక్షల్ని విధించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్రంప్ సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.
‘అధ్యక్షుడు బైడెన్ దేశాన్ని ఇస్లామిక్ ఉగ్రవాదం నుంచి కాపాడాలని అనుకుంటే.. పలు దేశాలపై ప్రయాణ నిషేధాన్ని పునరుద్ధరించాలి. దాంతో పాటు శరణార్థులకు ఆశ్రయం కల్పించే విషయంపైనా గతంలో నేను తీసుకువచ్చిన ఆంక్షల్ని అమలులోకి తేవాలి. ప్రస్తుతం ఉగ్రవాద కార్యకలాపాలు ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. ఆన్‌లైన్ వేదికగా నియామకాలు జరుగుతున్నాయి. ఉగ్రవాదాన్ని మన దేశం నుంచి నిర్మూలించడానికి మనం కొంత తెలివిగా పనిచేయాల్సిన అవసరం ఉంది. కొన్ని నిబంధనల్ని అమలులోకి తేవాలి. యూరప్ చేసిన ఇమ్మిగ్రేషన్ తప్పుల్ని మనం తిరిగి చేయకూడదు’ అని ట్రంప్ తెలిపారు.
ట్రంప్ హయాంలో ముస్లిం దేశాలైన ఇరాన్, ఇరాక్, లిబియా, సోమాలియా, సూడాన్, సిరియా, యెమెన్ దేశాలపై ప్రయాణ నిషేధాన్ని విధించిన విషయం తెలిసిందే. కానీ బైడెన్ అధికారంలోకి వచ్చాక గత అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షలను ఎత్తివేశారు.





