కరోనా వ్యాక్సిన్ తయారీలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న భారత్ వ్యాక్సిన్ ఎగుమతిలోనూ దూసుకెళ్తోంది. ఇప్పటి వరకు రూ.338 కోట్ల విలువైన కరోనా వ్యాక్సిన్‌లను విదేశాలకు ఎగుమతి చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటిలో స్నేహపూర్వక దేశాలకు ఉచితంగా అందించడంతో పాటు మరికొన్ని దేశాలకు వాణిజ్య పరంగా వ్యాక్సిన్‌లను ఎగుమతి చేసినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమలశాఖ మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభలో తెలిపారు.
భారత్ నుంచి వ్యాక్సిన్ ఎగుమతులపై సభ్యులు అడిగిన ప్రశ్నకు.. జనవరి నుంచే వ్యాక్సిన్ ఎగుమతి ప్రారంభించినట్లు పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశీయంగా వ్యాక్సిన్ అవసరాలకే తొలి ప్రాధాన్యత ఇస్తున్నామన్న ఆయన, స్నేహపూర్వక దేశాలకు కూడా టీకాలను అందిస్తున్నామని స్పష్టంచేశారు. సీరం ఇన్‌స్టిట్యూట్ తయారుచేసిన కొవిషీల్డ్ వ్యాక్సిన్ 62.7లక్షల డోసుల ఎగుమతికి అనుమతి ఇచ్చినట్లు కేంద్ర మంత్రి వెల్లడించారు. వీటి విలువ రూ.125.4కోట్లు ఉంటుందని తెలిపారు.
ఇలా భారత్ నుంచి దాదాపు 25దేశాలకు వ్యాక్సిన్ ఎగుమతి అవుతున్నట్లు సమాచారం. సౌదీ అరేబియా, బ్రెజిల్, మోరాకో, ఫిలిప్పీన్స్, యూఏఈ, ఖతార్ వంటి దేశాలకు వాణిజ్య పరంగా వ్యాక్సిన్లు ఎగుమతి అవుతున్నాయి. ఇక శ్రీలంక, మయన్మార్, నేపాల్ వంటి పొరుగు దేశాలకు భారత్ ఉచితంగానే కొంతవరకు వ్యాక్సిన్ డోసులను అందిస్తోంది.
ఇదిలాఉంటే, భారత్ లో సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో పాటు భారత్ బయోటెక్ అభివృద్ధిచేసిన రెండు వ్యాక్సిన్ల వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 75లక్షల మందికి తొలి టీకాను అందించగా, వీరికి రెండో డోసు అందించేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. ప్రస్తుతం తొలి దశలో భాగంగా ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు వంటి కరోనా యోధులకు టీకాలను అందజేస్తున్నారు.