
గత 18 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా సరిహద్దుల వద్ద ఈ ఏడాది పాకిస్థాన్ సైన్యం దుశ్చర్యలు తారస్థాయికి చేరాయి. 2020లో ఏకంగా 5,100 సార్లు కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడిచిన పాకిస్థాన్.. 36 మందిని బలిగొంది. మరో 136 మంది తీవ్రంగా గాయపడ్డారు. పొరుగు దేశపు సైన్యం దుశ్చర్యల నుంచి సరిహద్దు గ్రామాల ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం 14వేలకుపైగా బంకర్లను నిర్మిస్తోంది.
మరోవైపు పాక్ కవ్వింపు చర్యలను భారత దళాలు ఎప్పటికప్పుడూ సమర్థంగా తిప్పికొట్టాయి. 2020లో 203మంది ఉగ్రవాదులను భారత సైన్యం మట్టుబెట్టింది. వీరిలో 166మంది స్థానిక ముష్కరులు ఉన్నారు. 37 మంది పాకిస్థాన్ కు చెందిన వారు. మరోవైపు 43మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా, మరో 92మంది గాయపడ్డినట్టు అధికార వర్గాల సమాచారం. వీటితో పాటు 49మంది ఉగ్రవాదులను అధికారులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది.
పాక్ దుశ్చర్యల నేపథ్యంలో భారత ప్రభుత్వం సరిహద్దు గ్రామాల ప్రజల్ని రక్షించేందుకు నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద రూ.415 కోట్లతో 14,400 బంకర్ల నిర్మాణం చేపట్టింది. రజౌరీ, పూంఛ్, కథువా, సాంబ, జమ్మూ జిల్లాల్లో ఇలాంటి 7,777 బంకర్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. మిగిలిన వాటిని త్వరలోనే పూర్తి చేయనుంది. భారత్-పాక్ మధ్య 3,323 కి.మీ మేర సరిహద్దు విస్తరించి ఉంది. ఇందులో 221 కి.మీ మేర అంతర్జాతీయ సరిహద్దు, 740 కి.మీ మేర నియంత్రణ రేఖ జమ్మూకశ్మీర్ పరిధిలోకి వస్తుంది.





