News

ప్రధాని చేతుల మీదుగా దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలు ప్రారంభం

481views

దేశంలోనే తొలి డ్రైవర్‌ రహిత మెట్రో రైలును ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. ఢిల్లీ మెట్రోకు సంబంధించి పశ్చిమ జనకపురి-బొటానికల్‌ గార్డెన్‌ మధ్య 37 కిలోమీటర్ల పొడవున్న మెజంటా లైన్‌లో ఈ రైలును వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని ఆవిష్కరించారు. నేటి నుంచే ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నడిచే మెరుగైన రవాణా వ్యవస్థకు సంబంధించి నవ శకానికి ఇది ప్రారంభమని ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌(డీఎంఆర్‌సీ) పేర్కొంది. మజ్లిస్‌ పార్క్‌-శివ్‌ విహార్‌ మధ్య 57 కిలోమీటర్ల పొడవున్న పింక్‌ లైన్‌ మార్గంలోనూ చోదకరహిత మెట్రో రైలు సేవలను 2021 మధ్యకాలం నాటికి విస్తరించనున్నట్లు వెల్లడించింది. పింక్‌ లైన్‌ కూడా ప్రారంభమైతే ఢిల్లీ మెట్రోలో 94 కిలోమీటర్ల మేర డ్రైవర్‌ రహిత రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. ప్రపంచంలోని డ్రైవర్‌ రహిత మెట్రో మార్గంలో ఇది సుమారు 9 శాతం అని డీఎంఆర్‌సీ పేర్కొంది.

‘స్మార్ట్ వ్యవస్థలో భారత్ ఎంతగా వేగంగా అభివృద్ధి చెందుతుందో ఈ రైలు ప్రారంభం వెల్లడిస్తోంది. నేషనల్ కామన్‌ మొబిలిటీ కార్డ్(ఎన్‌సీఎంసీ) ద్వారా ఢిల్లీ మెట్రో అనుసంధానం అయింది. కొన్ని సంవత్సరాల క్రితం వరకు స్మార్ట్ వ్యవస్థపై అంతగా దృష్టి పెట్టలేదు. అప్పట్లో నిరాసక్త వాతావరణం ఉండేది. పట్టణీకరణ, సాంకేతిక అభివృద్ధి మధ్య చాలా తేడా కనిపించింది. దాన్ని మా ప్రభుత్వం మార్చింది. పట్టణీకరణను సులభతర జీవన శైలికి ఒక అవకాశంగా పరిగణించాలి’ అని ఈ సందర్భంగా ప్రధాని వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.