
సంప్రదాయ వైద్యం కోసం భారత్‌లో ప్రపంచస్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) శుక్రవారం ప్రకటించింది.
‘ధన్వంతరి జయంతి’ని పురస్కరించుకుని జరిగే ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా నేడు జయపుర(రాజస్థాన్), జమనగర్(గుజరాత్)లలో రెండు ఆయుర్వేద శిక్షణ, పరిశోధనా సంస్థలను ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానమ్ సంప్రదాయ వైద్యం కోసం భారత్‌లో ప్రపంచ స్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వీడియో సందేశం ద్వారా ప్రకటించారు. సంప్రదాయ వైద్యంపై అవగాహన కల్పించేందుకు, ఆయుర్వేద వైద్యంలో శిక్షణ, పరిశోధనలను మరింత బలోపేతం చేసేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
డబ్ల్యూహెచ్‌వో ప్రకటనపై ప్రధాని మోడీ ఆనందం వ్యక్తం చేశారు. ఆయుర్వేదం భారత వారసత్వ సంపద అని, దానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు లభించడం గర్వంగా ఉందని ప్రధాని అన్నారు. భారత సంప్రదాయ విజ్ఞానం ఇతర దేశాలను సుసంపన్నం చేస్తుండటం సంతోషకరమన్నారు. సంప్రదాయ వైద్యం కోసం ప్రపంచస్థాయి కేంద్రాన్ని భారత్ లో ఏర్పాటు చేయడం గర్వకారణమని తెలిపారు. ప్రపంచానికే ఔషధ కేంద్రంగా ఎదుగుతున్న భారత్ తాజా ప్రకటనతో ప్రపంచ సంరక్షణ కేంద్రంగా మారుతుందని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. భారత్ కు ఇంత గొప్ప బాధ్యతను కల్పించిన డబ్ల్యూహెచ్‌ఓకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ధన్వంతరి జయంతి’ని పురస్కరించుకుని 2016 నుంచి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏటా ఆయుర్వేద దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. కొవిడ్ కారణంగా ఈ సారి ఈ వేడుకను వర్చువల్ గా జరిపారు.





