News

ఢిల్లీ అల్లర్లు 2020: యుఎపిఎ చట్టం కింద ఉమర్ ఖలీద్‌ విచారణకు అనుమతించిన కేజ్రీవాల్ ప్రభుత్వం మరియు కేంద్ర హోంశాఖ

696views

మైనారిటీ అనుకూల ప్రభుత్వ ఇమేజ్ ను ప్రక్కనబెడుతూ ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ఈశాన్య ఢిల్లీలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మత హింసకు సంబంధించిన కేసులో జెఎన్‌యు మాజీ విద్యార్థి నాయకుడు ఉమర్ ఖలీద్‌పై విచారణకు అనుమతి ఇచ్చింది.

ఉగ్రవాద నిరోధక చట్టం యుఎపిఎ కింద మాజీ జెఎన్‌యు విద్యార్థి నాయకుడిపై దర్యాప్తు జరిపేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చట్టం ప్రకారం, UAPA కింద ఒక వ్యక్తిని విచారించడానికి, ముందు MHA నుండి అనుమతి తీసుకోవాలి.

ఫిబ్రవరి 2020 లో ఈశాన్య ఢిల్లీ అల్లర్ల వెనుక ఉన్న పెద్ద కుట్రకు సంబంధించిన కేసులో చట్టవిరుద్ధ కార్యకలాపాలు (నివారణ) (UAPA) చట్టం కింద ఉమర్ ఖలీద్‌ను సెప్టెంబర్‌లో అరెస్టు చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన సమయంలోనే దేశ రాజధాని ఢిల్లీలో అల్లర్లు చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ అల్లర్ల సమయంలో హింసను ప్రేరేపించారనే ఆరోపణతో 15 మంది నిందితులపై ఢిల్లీ పోలీసులు 17,500 పేజీల భారీ చార్జిషీట్ ను దాఖలు చేశారు.

” ఢిల్లీ అల్లర్లకు సంబంధించి పోలీసులు నమోదు చేసిన అన్ని కేసులలో మేము ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇచ్చాము. ఇప్పుడు, నిందితులు ఎవరో తేల్చే బాధ్యత కోర్టులదే” అని ప్రభుత్వ సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. ఢిల్లీ పోలీసులు ఇప్పుడు తమ అనుబంధ చార్జిషీట్‌లో ఖలీద్‌ పేరు కూడా చేర్చవచ్చు.

“యుఎపిఎ సెక్షన్ 13 కింద ఒకరిని విచారించడానికి, అవసరమైన అనుమతులు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుండి ఇప్పటికే మాకందాయి. యుఎపిఎ సెక్షన్ – 16,17 మరియు 18 కింద ప్రాసిక్యూషన్ కోసం అవసరమైన, ఢిల్లీ ప్రభుత్వ అనుమతి కూడా లభించింది” అని అధికార వర్గాలు తెలిపాయి.

మత హింసకు సంబంధించిన కేసులో సెప్టెంబర్ 13 న ఖలీద్‌ను యుఎపిఎ చట్టం కింద అరెస్టు చేశారు. తమ ఆరోపణలను రుజువు చేయడానికి, అల్లర్లు జరుగుతున్న సమయంలో ‘ఫిబ్రవరి 24 నుండి వారు జరిపిన వాట్సప్ సంభాషణలను (వాట్సప్ చాట్) చార్జిషీట్ లో తాము పొందు పరచామని కూడా పోలీసులు గతంలో పేర్కొన్నారు.

శిక్షార్హమైన కాశ్మీరీ వేర్పాటువాదులు అఫ్జల్ గురు మరియు మక్బూల్ భట్ లకు మరణశిక్ష విధించడాన్ని నిరసిస్తూ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (JNU) లో జరిగిన దేశ వ్యతిరేక ప్రదర్శనలలో ఉమర్ ఖలీద్ కూడా పాల్గొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 2016 నుండి ఇదే కేసుపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ కూడా జరుగుతున్నాయి. 2020 ఫిబ్రవరి 28 న ఢిల్లీ ప్రభుత్వం 2016 కేసులో విచారణకు తమ అనుమతి ఇచ్చింది.

ఫిబ్రవరి 2016 లో జెఎన్‌యులో దేశ వ్యతిరేక ప్రదర్శనలు నిర్వహించిన నాలుగు రోజుల తరువాత, భారత శిక్షాస్మృతిలోని సెక్షన్ 124 కింద దేశద్రోహం, నేరపూరిత కుట్ర ఆరోపణలపై జెఎన్‌యు స్టూడెంట్ యూనియన్ అధ్యక్షుడు కన్హయ్య కుమార్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కన్హయ్య కుమార్‌ను అరెస్టు చేసిన తరువాత ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్య, రామ నాగ, అనంత్ ప్రకాష్, అశుతోష్ కుమార్ సహా మరో ఐదుగురు అజ్ఞాతంలోకి వెళ్లి 10 రోజుల తరువాత తిరిగి వచ్చారు.

పోలీసులకు లొంగిపోయిన ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు అనంతరం జెఎన్‌యు అడ్మినిస్ట్రేటివ్ ప్యానెల్ పలువురు విద్యార్థులకు పలు రకాల శిక్షలు విధించింది. కన్హయ్య కుమార్‌కు 10,000 రూపాయల జరిమానా విధించింది. తరువాత ఉమర్ ఖలీద్, అనిర్బన్ భట్టాచార్యలను ఒక సెమిస్టర్ పాటు విశ్వవిద్యాలయం నుండి తొలగించారు.

Source : Organiser

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.