ArticlesNews

కొండను త్రవ్వి నీటిని తెచ్చిన కలియుగ ‘భగీరథునులు’

536views

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న నేటి కాలంలోనూ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న గ్రామాలు కోకొల్లలు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏళ్లు గుడుస్తున్నా ఇప్పటికీ తాగునీరు, సాగునీరు లాంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకోని పల్లెలెన్నో. సరిగ్గా అలాంటి సమస్యలతోనే కొట్టిమిట్టాడుతోంది ఓ గ్రామం. దానిని అభివృద్ధి చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. రాజకీయ నాయకులు కేవలం మాటలకే పరిమితమైపోయారు తప్ప హామీలు కార్యరూపం దాల్చలేదు. దీంతో ఆ గ్రామంలోని 250 మంది మహిళలు అపర కాళికల్లా చెలరేగిపోయారు. నిరాటంకంగా 18 నెలల పాటు ఏకంగా ఓ కొండనే తవ్వేసి తమ గ్రామానికి నీటిని తరలించి కలియుగ ‘భగీరథునులు’ అనిపించుకున్నారు.

మధ్యప్రదేశ్‌లోని అంగ్రోథా… అదో ఆదివాసీ గ్రామం. అక్కడి వారంతా ఏదో కూలి పనులు చేసుకుంటూ.. అడవి తల్లి ఒడిలో నిద్రపోయే వారే. పొట్టకూటికోసం ఏదైనా వ్యవసాయం చేద్దామన్నా నీరు అందుబాటులో ఉండేది కాదు. వర్షాలు కురిసినా ఏం లాభం? జరజరమంటూ దిగువకు పోయేది. వాన నీటిని నిల్వ చేసే సదుపాయం లేదు. అక్కడికి అర కిలోమీటరు దూరంలో కాల్వ ఉన్నప్పటికీ అందులో నీటిని గ్రామానికి మళ్లించే అవకాశం లేదు. మధ్యలో పెద్ద కొండ. కాల్వ తవ్వించి ఆ గ్రామస్థులకు సాయం చేద్దామన్న ఆలోచన అటు అధికారులకు గానీ, ఇటు ప్రజా ప్రతినిధులకు గానీ రాలేదు. పైగా వారంతా ఆదివాసీలు కావడంతో ప్రభుత్వంలో కొట్లాడి పనులు చేయించుకునేంత చాకచక్యం వాళ్లలో లేదు.

ఇలా సంవత్సరాలు గడిచిపోయినా.. పరిస్థితుల్లో ఎలాంటి మార్పూ రాలేదు. ఓవైపు కుటుంబాల పోషణ భారం పెరుగుతోంది. అధికారుల వల్ల పని కాదనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ఆ గ్రామంలోని మహిళలంతా ఏకతాటిపైకి వచ్చారు. ఏకంగా 18 నెలల పాటు శ్రమించి కొండ తవ్వి.. నీరు ప్రవహించేందుకు వీలుగా మార్గం సుగమం చేసుకున్నారు. కేవలం పార, పలుగులు తప్ప ఎలాంటి యంత్ర పరికరాలూ ఉపయోగించక పోవడం గమనార్హం. కాల్వ సిద్ధం కావడంతో ఆ గ్రామానికిప్పుడు నీరు ఉరుకులతో వస్తోంది. ఇక వ్యవసాయం చేసుకునేందుకు సమృద్ధిగా నీరుంటుందని వారంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

”దగ్గర్లోని కాలవ నుంచి నీటిని తీసుకు రావడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది. అడవుల్లో ఎంత వర్షం పడినా, అలా కిందికి జారుకుంటూ వెళ్లిపోవడమే తప్ప దాంతో మాకు ఎలాంటి ఉపయోగం ఉండేది కాదు. దీనికి ఎలాగైనా ఓ పరిష్కార మార్గం కనిపెట్టాలనే ఉద్దేశంతో మా ఊరి మహిళలమంతా ఏకమయ్యాం. కొండను తవ్వి నీటిని తీసుకొచ్చాం” అని వారంతా అంటున్నారు. దగ్గర్లో నీరున్నా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉండేదని, ముఖ్యంగా వ్యవసాయం చేసేందుకు నీరు ఉండేది కాదని, ఈ సమస్యను ఎలాగైనా జయించాలనే ఉద్దేశంతో తామే ఈ నిర్ణయం తీసుకొని కాల్వ తవ్వుకున్నామని చెబుతున్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఏళ్లపాటు ఆశతో ఎదురుచూసి అలసిపోయిన ఈ మహిళలు తామే ముందుకొచ్చి తమ పల్లెలో నీటి సమస్యను పరిష్కరించుకొని ఆదర్శంగా నిలుస్తున్నారు.

Source : Enadu

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.