
ఇండో-చైనా సరిహద్దుల్లో భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహరిస్తూ డ్రాగన్ ఎత్తులను చిత్తు చేస్తోంది. గత మూడు వారాల్లో భారత సైన్యం లడ్డాఖ్ లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న ఆరు ప్రధాన ఎత్తయిన కొండలను స్వాధీనం చేసుకుందని ప్రభుత్వ వర్గాలు ఓ మీడియా సంస్థతో తెలిపాయి. ఆయా వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం ‘ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు వాస్తవాధీన రేఖ వెంబడి భారత సైన్యం ఆరు ముఖ్యమైన కొండలను స్వాధీనం చేసుకుంది. వాటిలో మగర్ హిల్, గురుంగ్ హిల్, రిసెహెన్ లా, రెజంగ్ లా, మొఖ్పారీ మరియు ఫింగర్ 4 సమీపంలోని మరో ఎత్తయిన ప్రాంతం’ ఉన్నాయని తెలిపాయి.

‘చైనా ముందుగా ఆయా కొండలను ఆక్రమించి భారత్‌ను దెబ్బ తీయాలని భావించినప్పటికీ భారత సైన్యం ఎంతో అప్రమత్తంగా వ్యవహరించి వాటిని స్వాధీనం చేసుకున్నాయి. దీని ద్వారా ఇప్పుడు మన దళాలకు శత్రువుల కదలికలపై నిఘా పెట్టడం మరింత సులువు అవుతుంది. అలా చైనా ప్రయత్నాలు విఫలం కావడంతో పాంగాంగ్ ఉత్తర ప్రాంతంలో డ్రాగన్ సైన్యం మూడు సార్లు గాల్లోకి కాల్పులకు తెగబడింది. భారత సైన్యం ఆయా ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో రెజంగ్ లా, రెచెన్ లా కొండల సమీపంలో చైనా ఆర్మీ 3వేల అదనపు సాయుధ బలగాలను మోహరించింది. డ్రాగన్ సైన్యం పలు విధాలుగా రెచ్చగొట్టేందుకు యత్నిస్తుండటంతో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, సీడీఎస్ బిపిన్ రావత్, ఆర్మీ చీఫ్ మనోజ్ నరవణేల పర్యవేక్షణలో భారత భద్రతా దళాలు సంయుక్తంగా పనిచేస్తున్నాయి’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
భారత్, చైనా సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖను మార్పు చేసేందుకు చైనా యత్నించడంతో గత కొన్ని నెలలుగా రెండు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్‌లో గల్వాన్ వ్యాలీ సమీపంలో చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హద్దులు మీరి 20 మంది భారత సైనికులను పొట్టన పెట్టుకుంది. దీంతో భారత్ కూడా సైన్యం ఆయుధాలు ఉపయోగించవద్దనే నిబంధనలో మార్పులు చేసింది.





