News

8 మంది రాజ్యసభ సభ్యుల సస్పెన్షన్

732views

వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం రాజ్యసభలో చోటుచేసుకున్న గందరగోళ పరిస్థితుల పట్ల ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బిల్లుల్ని నిబంధనలకు విరుద్ధంగా ఆమోదింపజేశారంటూ డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సింగ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును తోసిపుచ్చారు. సభా నియమాల ప్రకారం డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాసం ఆమోదనీయం కాదన్నారు.

బిల్లుల చర్చ, ఓటింగ్‌ సమయంలో నిన్న విపక్ష ఎంపీలు వ్యవహరించిన తీరును ఛైర్మన్‌ తీవ్రంగా ఆక్షేపించారు. రాజ్యసభ చరిత్రలో ఓ చీకటి దినంగా మిగిలిపోతుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. భౌతికంగా ఇబ్బంది పెట్టడంతో పాటు డిప్యూటీ ఛైర్మన్‌ను తన విధుల్ని నిర్వర్తించకుండా అడ్డుపడ్డారంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ అనూహ్య పరిణామాల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన ఘటనను తీవ్రంగా ఖండించారు. నిరసనలకు కారణమైన ఎంపీలు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు.

నిన్న అనుచితంగా ప్రవర్తించిన విపక్ష ఎంపీలపై చర్యలు తీసుకోవాలన్న అధికార భాజపా ఫిర్యాదు మేరకు నిబంధనల ప్రకారం ఛైర్మన్‌ వారిపై వేటు వేశారు. సభ నుంచి 8 మంది సభ్యులను వారం పాటు సస్పెండ్‌ చేశారు. ఎంపీలు డెరెక్‌ ఒబ్రెయన్‌, సంజయ్‌ సింగ్‌, రాజుసత్వ, రిపున్‌బోర, డోలాసేన్‌, కె.కె.రాగేశ్‌, నాజిర్‌ హుస్సేన్‌, ఎలమరిన్‌ కరీంపై చర్యలు తీసుకున్నారు. వెంటనే సభ నుంచి వెళ్లిపోవాలని ఆదేశించారు. అయినా, వారు నిరాకరించడంతో సభను ఉదయం 10 గంటల వరకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా సస్పెండైన ఎంపీలు సభను వీడకపోవడంతో డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ సభను మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.