News

“అమ్మ భాష” కు గొడుగు పడదాం – భాషాభిమానుల ఐక్యవేదిక పిలుపు

800views

తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం “అమ్మ భాష” – భాషాభిమానుల ఐక్యవేదిక సభ్యులు తుమ్మలపల్లి కళాక్షేత్రం సమీపంలోని తెలుగు తల్లి విగ్రహానికి పూలమాలలు అర్పించారు. అనంతరం “అమ్మ భాష” సంస్థ వ్యవస్థాపకులు శ్రీ దుర్భా శ్రీనివాస్ మాట్లాడుతూ మన మాతృభాష తెలుగు తేనెలొలికే భాష అని, తెలుగు వారిగా జన్మించడం మన పూర్వ జన్మ సుకృతమని అన్నారు. ఛందో బద్ధమైన పద్యాలు, పద్య నాటకాలు మరియు అవధాన ప్రక్రియ తెలుగు భాషకు మాత్రమే స్వంతమని, అన్ని ప్రత్యేకతలు కలిగిన తెలుగును రక్షించుకోవలసిన అవసరమున్నదని, అందరమూ మన అమ్మ భాష తెలుగుకు గొడుగు పట్టాలని ఆయన అన్నారు.

సంస్థ అధ్యక్షులు డాక్టర్ కప్పగంతు రామకృష్ణ మాట్లాడుతూ “మా తాత ముత్తాతలు తెలుగులో మాట్లాడుకునేవారు అని మన భావితరాలు పరాయి భాషలో చెప్పుకునే దుస్థితి రాకూడదని, ఇందుకోసం నేటితరం మేలుకుని అమ్మ భాషకు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. సంగీత సాహిత్యాలకు అనువైన సుందర భాష తెలుగని, రెండువేల సంవత్సరాలకు పైబడిన ఘన చరిత్ర మన భాషకు ఉందన్నారు.

ఉపాధ్యక్షుడు శ్రీ గూటాల రామకుమార్ మాట్లాడుతూ కుటుంబ వ్యవహారం నుంచే తెలుగు భాష అమలు కావాలని, తల్లిదండ్రులు చొరవ తీసుకుని విద్యార్థి దశ నుంచే మాతృభాష పట్ల మమకారం పెంచేలా తమ బిడ్డలకు ప్రేరణ కల్పించి, తగిన శిక్షణ ఇవ్వాలన్నారు. ప్రతి ఇల్లూ తెలుగు భాష మహోద్యమానికి కేంద్రం కావాలన్నారు.

కార్యవర్గ సభ్యురాలు ఆదుర్తి సుహాసిని ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయాన్ని శ్రావ్యంగా గానం చేశారు. సంస్థ సభ్యులు చైత్ర, శివాజీ, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.