News

రష్యాలో యుద్ధ విన్యాసాలకు నో అన్న భారత్‌

619views

చ్చే నెలలో రష్యాలో జరిగే బహుళ దేశాల సైనిక విన్యాసాల నుంచి వైదొలగాలని భారత్‌ నిర్ణయించింది. కరోనా మహమ్మారి, ‘ఇతర ఇబ్బందుల’ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రక్షణ మంత్రిత్వశాఖ శనివారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ విన్యాసాల్లో చైనా కూడా పాల్గొనడం వల్లే మన దేశం వైదొలిగినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. తూర్పు లద్దాఖ్‌లో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో ‘డ్రాగన్‌’కు విస్పష్ట సందేశాన్ని పంపేందుకు ఈ చర్యను చేపట్టినట్లు పేర్కొన్నాయి. ‘కావ్‌కాజ్‌ 20’ పేరిట సెప్టెంబర్‌ 15 నుంచి 26 వరకూ రష్యాలోని అస్ట్రాఖాన్‌ ప్రాంతంలో ఈ విన్యాసాలను నిర్వహిస్తున్నారు. ఇందులో చైనా, పాకిస్థాన్‌ సహా 20 దేశాలు పాల్గొనాల్సి ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొంటామని గత వారమే రష్యాకు భారత్‌ తెలియజేసింది. అయితే సైనిక, విదేశీ వ్యవహారాల శాఖ ఉన్నతాధికారులతో చర్చల తర్వాత ఈ నిర్ణయాన్ని మార్చుకున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ”భారత్, రష్యాలు సన్నిహిత, వ్యూహాత్మక భాగస్వామ్య దేశాలు. రష్యా ఆహ్వానం మేరకు భారత్‌ అనేక అంతర్జాతీయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వహిస్తోంది. అయితే కరోనా మహమ్మారి, అవసరమైన ఏర్పాట్లు సహా విన్యాసాలకు సంబంధించిన ఇతర ఇబ్బందుల వల్ల కావ్‌కాజ్‌ విన్యాసాల్లో పాలుపంచుకోకూడదని నిర్ణయించాం” అని రక్షణ శాఖ అధికార ప్రతినిధి ఎ.భరత్‌ భూషణ్‌ బాబు తెలిపారు. సైన్యానికి చెందిన 150 మందిని, వైమానిక దళానికి చెందిన 45 మందిని, నౌకా దళానికి చెందిన పలువురు అధికారులను ఈ విన్యాసాలకు పంపాలని భారత్‌ మొదట అనుకుంది. ఈ యుద్ధక్రీడల్లో ఉగ్రవాద దాడిని తిప్పికొట్టడం వంటి అభ్యాసాలను సైనికులు చేపడతారు. భారత్, చైనాల నడుమ మధ్యవర్తిత్వానికి రష్యా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామానికి ప్రాధాన్యం ఏర్పడింది. వచ్చే నెలలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) రక్షణ మంత్రుల సదస్సులో పాల్గొనేందుకు భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ రష్యా వెళ్లనున్నారు. ప్రాంతీయ భద్రతా పరిస్థితులు, వ్యూహాత్మక అంశాలపై ఈ భేటీలో చర్చించనున్నారు.

చతుర్భుజ కూటమికి సై?

కావ్‌కాజ్‌ విన్యాసాల్లో పాల్గొంటే చైనాకు వ్యతిరేకంగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన ‘చతుర్భుజ కూటమి’ ఏర్పాటుకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. తన తాజా నిర్ణయం ద్వారా ఈ కూటమికి భారత్‌ పరోక్షంగా మద్దతు తెలిపినట్లయింది. కొద్ది నెలల్లో భారత నౌకాదళం ఆతిథ్యమివ్వనున్న ‘మలబార్‌’ విన్యాసాల్లో ఇది ఒక రూపునకు వచ్చే అవకాశం ఉంది. గతంలో జరిగిన మలబార్‌ విన్యాసాల్లో భారత్, అమెరికా, ఆస్ట్రేలియాలు పాలుపంచుకున్నాయి. ఈ దఫా జపాన్‌ను ఆహ్వానించే అంశాన్ని భారత్‌ పరిశీలిస్తోంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.