
జమ్మూ-కశ్మీర్‌లో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు ఇద్దరు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం ఉదయం అనంత్‌నాగ్ జిల్లా శ్రీగుఫ్వారా ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారన్న సమాచారంతో భద్రతా దళాలు నిర్బంధ తనిఖీలు నిర్వహించాయి. ఈ క్రమంలో ముష్కరులు కాల్పులకు తెగబడడంతో బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. దీంతో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరివురు జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందినవారని జమ్మూకశ్మీర్ డీజీపీ దిల్‌బాగ్ సింగ్ తెలిపారు. వీరిలో ఒకరు స్థానికుడు కాగా.. ఒకరు పాక్ చెందినవారని పేర్కొన్నారు. సంఘటనా స్థలంలో భారీ స్థాయిలో ఆయుధాలు లభ్యమయ్యాయని తెలిపారు.
మరో ఘటనలో జులై 11-12 మధ్యరాత్రి ముగ్గురు ముష్కరుల్ని హతమార్చినట్లు బారాముల్లా డీఐజీ సులేమాన్ సోమవారం వెల్లడించారు. వీరు లష్కరే తోయిబా ఉగ్రసంస్థకు చెందినవారన్నారు. వారి నుంచి భారీ స్థాయిలో ఆయుధాలు లభ్యమయ్యాయని.. దాన్ని బట్టి చూస్తే వారు భారీ ఉగ్రదాడికి ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోందన్నారు.





