
జూన్ 15వ తేదీన చైనాకు చుక్కలు చూపించిన 16 బిహార్ రెజిమెంట్‌కు కొత్త కమాండింగ్ అధికారి బాధ్యతలు చేపట్టారు. చైనా జవాన్లతో జరిగిన ఘర్షణలో నాటి కమాండింగ్ ఆఫీసర్ వీరమరణం పొందిన విషయం తెలిసిందే. ఆయనతో కలిపి ఒక్క 16 బిహార్ రెజిమెంట్‌లోనే మొత్తం 12 మంది అమరులయ్యారు. ఈ ఘటన తర్వాత భారత దళాలు అప్రమత్తమై చైనాను నిలువరించిన సంగతి తెలిసిందే.
సైనికుల్లో సమన్వయం పెంచేలా..
సాధారణంగా కర్నల్ ర్యాంక్ క్లియర్ చేసిన ఆర్మీ అధికారిని కమాండింగ్ ఆఫీసర్‌గా నియమిస్తారు. కానీ, గల్వాన్ వంటి సున్నితమైన ఘటన జరిగిన చోట్ల కొత్త ఆఫీసర్ వస్తే పరిస్థితులకు అలవాటుపడుతూ తోటి సిబ్బందితో సమన్వయం పెంచుకోవడానికి సమయం పడుతుంది. అందుకే 16 బీహార్ రెజిమెంట్ యూనిట్ నుంచే ఓ అధికారిని ఇవ్వాలని నిర్ణయించారు. సాధారణంగా యూనిట్‌కు కమాండ్ ఆఫీసర్‌ను తండ్రి వలే చూస్తారు. ఇటీవల గల్వాన్ ఘటనలో కర్నల్ సంతోష్‌బాబు అమరుడుకావడంతో ఆ యూనిట్‌లో యుద్ధసన్నద్ధతను వేగవంతం చేయడానికి ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలిసింది. సున్నితమైన వ్యవహారం కావడంతో సైన్యం పేరును వెల్లడించడంలేదు. ఈ సమయంలో వచ్చే కొత్త అధికారి యూనిట్ మొత్తాన్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి 16 బిహార్ రెజిమెంట్ నినాదమైన ‘కరమ్ హై ధరమ్’ నిలబెట్టాల్సిన బాధ్యత ఆయనపై ఉంది.
కోలుకుని విధుల్లోకి..
జూన్ 15నాటి ఘటనలో గాయపడిన పలువురు జవాన్లు కొలుకుని తిరిగి విధుల్లోకి చేరారు. వారంతా లేహ్ 153 జనరల్ హాస్పిటల్, థాంట్సే ఫీల్డ్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.





